Tilak Varma: రింకూ నీకంటే బెస్ట్.. దొంగ ఏడుపు ఎందుకు..?
ఐపీఎల్-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియాకు ఎంపికయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్‌లో యశస్వి రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ ముంబై బ్యాటర్ ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తం 625 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు 11 మ్యాచ్‌లలో 343 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ క్రమంలో వీరిద్దరు భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే, టీ20 సిరీస్ జట్టులో స్థానం ఆశించిన టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.
దీంతో అభిమానులు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రింకూ విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. గతంలో టీమిండియాకు ఆడిన నితీశ్ తాజా ట్వీట్ చూస్తుంటే.. తాను కూడా జట్టులో చోటు ఆశించినట్లు తెలుస్తోంది. ‘‘గడ్డు కాలమే మంచి రోజులకు పునాది వేస్తుంది’’ అన్న అర్థంలో ఉన్న కోట్‌ను అతడు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా కొంతమంది నితీశ్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ట్రోలింగ్‌కు దిగారు. ‘‘రింకూ వంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే దిక్కులేదు భయ్యా! రుతురాజ్‌ను కూడా పక్కనపెట్టారు. ఇక నీ గురించి ఏం ఆలోచిస్తారు? బుద్ధిగా కేకేఆర్‌కు ఆడుకో! అనవసరంగా ఆశలు పెంచుకుంటే.. భంగపాటు తప్పదు’’ అని నితీశ్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా కేకేఆర్ తరఫున ఐపీఎల్-2023లో రింకూ సింగ్ 14 మ్యాచ్‌లలో 474 పరుగులు చేయగా.. కోల్‌కతా సారథి నితీశ్ రాణా 413 పరుగులు సాధించాడు. ఇక ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల రాణా.. 2021లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.