నాకు మచ్చగా మిగిలిపోయింది కాఫీ విత్ కరణ్ ఇంటర్యూపై రాహుల్
సెలబ్రిటీలు ఎక్కడున్నా సరే ఆచితూచి మాట్లాడాలి.. నోరు జారితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. తెలిసీ తెలియకుండా మాట్లాడినా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ ఎదుర్కొన్నాడు. గతంలో కాఫీ విత్ కరణ్ ఇంటర్యూలో పాల్గొని వివాదంలో చిక్కుకోవడంపై తాజాగా రాహుల్ స్పందించాడు. అది తనకు మాయని మచ్చలా మిలిగిపోయిందని గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సస్పెన్షన్ కు గురికాలేదని, అయితే ఆ ఇంటర్యూలో పొరపాటుగా మాట్లాడిన మాటల వల్ల శిక్ష అనుభవించానన్నాడు.
బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్‌షో ఆరో సీజన్‌లో పాండ్యాతో కలిసి కెఎల్ రాహుల్ పాల్గొన్నాడు. ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో మహిళలను ఉద్దేశించి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇద్దరూ క్షమాపణలు చెప్పినప్పటికీ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 20లక్షల చొప్పున జరిమానాతో పాటు కొంతకాలం సస్పెన్షన్ విధించింది. తొలిసారి అలాంటి అనుభవం ఎదురవడంతో ఎలా రియాక్ట్ కావాలో చాలారోజుల వరకూ అర్థం కాలేదని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్యూ తన జీవితాన్నే మార్చేసిందన్నాడు. ఆ వివాదం తనను చాలారోజులు భయపెట్టిందని కెెఎల్ రాహుల్ చెప్పాడు.