ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ
భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ మొదలుకాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి డ్రెస్ రిహార్సల్ గా మారిన ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకమే...అలాగే భారత జట్టులో కొందరు సీనియర్ ప్లేయర్స్ కు సైతం ఈ వన్డే సిరీస్ అగ్ని పరీక్షగా మారింది.

భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ మొదలుకాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి డ్రెస్ రిహార్సల్ గా మారిన ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకమే…అలాగే భారత జట్టులో కొందరు సీనియర్ ప్లేయర్స్ కు సైతం ఈ వన్డే సిరీస్ అగ్ని పరీక్షగా మారింది. ముఖ్యంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. దీంతో ఈ వన్డే సిరీస్ లో చెలరేగేందుకు విరాట్ ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నాగ్ పూర్ వన్డే కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే కింగ్ కోహ్లీని ఈ వన్డే సిరీస్ కు ముందు సచిన్ ఆల్ టైమ్ రికార్డు ఊరిస్తోంది.గత 19 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డ్‌ను అందుకునేందుకు విరాట్ కోహ్లీ 94 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఈ పరుగులు చేసినా.. లేదా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో చేసినా.. 19 ఏళ్ల రికార్డ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించనున్నాడు.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలు రాయి అందుకున్న క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ 350 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. 2006లో పాకిస్థాన్‌తో పెష్వార్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 283 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలతో పాటు 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 94 పరుగులు చేస్తే వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకోనున్నాడు. గతేడాది మూడే వన్డేలు ఆడిన కోహ్లీ.. శ్రీలంకతో 58 పరుగులే చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లీ 94 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్‌ను అధిగమించనున్నాడు.
ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత కుమార సంగక్కర ఉన్నాడు. అతను 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అతనికి ఈ ఫీట్ అందుకోవడానికి 378 ఇన్నింగ్స్‌లు పట్టింది. మరే బ్యాటర్ వన్డేల్లో 14వేల పరుగులు చేయలేదు. 36 ఏళ్ళ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లో సత్తా చాటి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.