రన్స్ లో కోహ్లీ, వికెట్లలో చాహల్ తోపు ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డులివే
ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత... పరుగుల వరద... వికెట్ల జాతర... గత 17 సీజన్లుగా ఎంతో మంది స్టార్ క్రికెటర్లు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు.

ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత… పరుగుల వరద… వికెట్ల జాతర… గత 17 సీజన్లుగా ఎంతో మంది స్టార్ క్రికెటర్లు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు. ఇప్పటికీ కొన్ని రికార్డులు అన్ బ్రేకబుల్ గా ఉంటే… మరికొన్ని బ్రేక్ అవుతూ కొత్తవి నమోదవుతున్నాయి. ఐపీఎల్ సీజన్ ఎప్పుడు మొదలైనా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ రసవత్తరంగానే ఉంటుంది. ఓవరాల్ గా ఐపీఎల్ టాప్ 10 రికార్డులను ఒకసారి చూస్తే అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబై, చెన్నై నిలిచాయి. ఈ రెండు జట్లు చెరో ఐదు టైటిళ్లను సాధించాయి. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ లలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో మూడు టైటిళ్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానలో కొనసాగుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న కోహ్లీ.. ఇప్పటివరకు 8,004 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 6,769, రోహిత్ శర్మ 6,628, డేవిడ్ వార్నర్ 6565, సురేశ్ రైనా 5528 ఉన్నారు. ఇప్పుడు వీరిలో రోహిత్ తప్ప ఇంకెవరూ ఆడట్లేదు. కాబట్టి ఇప్పట్లో కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం కష్టం. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో మోస్ట్ సిక్సెస్ రికార్డు గేల్ పేరిట ఉంది. ఈ విండీస్ వీరుడు లీగ్ లో అత్యధిక సిక్సర్లు బాదాడు. గేల్ ఏకంగా 357 సిక్స్ లు కొడితే ఆ తర్వాతి ప్లేస్ లో రోహిత్ శర్మ 280 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడిన క్రిస్ గేల్.. పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ 158, క్వింటన్ డి కాక్ 140, ఏబీ డివిలియర్స్ 133, కేఎల్ రాహుల్ 132 రన్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు. చాహల్ 205 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా 192, డ్వేన్ బ్రావో 183, భువనేశ్వర్ కుమార్ 181 వికెట్లతో ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ 114 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉండగా..ఆ తర్వాత సురేశ్ రైనా 109, కీరన్ పొలార్డ్ 103, రవీంద్ర జడేజా 103 క్యాచ్ లతో కొనసాగుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా మహేంద్రసింగ్ ధోనీ నిలిచాడు. ఇప్పటివరకు ధోనీ 264 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ 257, రోహిత్ శర్మ 257, విరాట్ కోహ్లీ 252 మ్యాచ్ లతో కొనసాగుతున్నారు. ఆడారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 146 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆర్‌సీబీ వేర్వేరు జట్లపై 144, 140, 138, 130 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.ఐపీఎల్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఆర్సీబీపై సన్ రైజర్స్ 287 రన్స్ తో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. అటు కేకేఆర్‌పై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటై అత్యల్ప స్కోర్ ను అందుకుంది.