కోహ్లీ రిటైర్మెంట్ అప్పుడే తేల్చేసిన విండీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్న కోహ్లీ ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చంటూ పలువురు విమర్శకులు కామెంట్స్ చేశారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్న కోహ్లీ ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చంటూ పలువురు విమర్శకులు కామెంట్స్ చేశారు. కొందరు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. అయితే రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెడుతూ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల వేటలో సాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. అయినా ఒక మ్యాచ్ లో ఫెయిల్ కాగానే విరాట్ రిటైరవాలనే డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ రిటైర్మెంట్ ఎప్పుడో స్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తేల్చేశాడు. విరాట్ 50 ఏళ్ల వరకు ఆడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించాడు.
కోహ్లి అంటేనే ఫిట్ నెస్ కు పెట్టింది పేరనీ, ఈ కారణంతోనే కోహ్లి 50 ఏళ్ల వరకు ఆడే ఛాన్స్ ఉంటుందని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల పాక్ పై సెంచరీతో అతను అందరికీ బ్యాట్ తోనే జవాబిచ్చాడన్నాడు. వన్డే ప్రపంచకప్ కు ముందు కోహ్లి ఫామ్ లో లేడనీ, కానీ ఆ టోర్నీలో అదరగొట్టాడనీ గుర్తు చేశాడు. అతని కమ్ బ్యాక్ నిజమైన క్యారక్టర్ ను చాటిందన్నాడు. అతని ఫైటింగ్ స్పిరిట్, ఎనర్జీ, తపన అద్భుతమని రిచర్డ్స్ ప్రశంసించాడు.
కోహ్లి ఫిట్ నెస్, ఆట పట్ల తపన కారణంగా అతను ఎప్పటివరకూ క్రికెట్ ఆడతాడో ఎవరూ చెప్పలేరన్నాడు. కానీ అతను 50 ఏళ్లు వచ్చే వరకూ ఆడతాడేమో అనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ఓ తరం ఆటగాళ్లను మరో జనరేషన్ ప్లేయర్లతో పోల్చడం సరికాదని రిచర్డ్స్ స్పష్టం చేశాడు. సచిన్, కోహ్లిని కంపేర్ చేయడంపై అతను ఇలా స్పందించాడు. వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. సచిన్ వన్డేల్లో 50 సెంచరీలు చేయగా.. ఆ రికార్డును తిరగరాసిన కోహ్లి ఇటీవల పాకిస్థాన్ పై 52వ సెంచరీని కూడా ఖాతాలో వేసుకున్నాడు.
అంతే కాకుండా ఇటీవల వన్డేల్లో 14 వేల పరుగులు కంప్లీట్ చేసిన ఫాస్టెస్ క్రికెటర్ గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అయితే ఆయా ఆటగాళ్ళు ఆడిన పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటి వరకూ 123 టెస్టులు, 300 వన్డేలు, 125 టీ ట్వంటీలు ఆడాడు. వన్డేల్లో 14 వేల 96 , టెస్టుల్లో 9 వేల 230 పరుగులు చేయగా.. టీ ట్వంటీల్లో 4 వేల 188 రన్స్ చేశాడు. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో షార్ట్ ఫార్మాట్ కు విరాట్ గుడ్ బై చెప్పేశాడు.