బలుపు తగ్గించుకో బాబూ, లక్నో స్పిన్నర్ కు మళ్ళీ ఫైన్
క్రికెట్ లో ఆట మాత్రమే ఉంటే సరిపోదు.. క్రమశిక్షణ కూడా ఉండాలి... ముఖ్యంగా గ్రౌండ్ లో ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి...

క్రికెట్ లో ఆట మాత్రమే ఉంటే సరిపోదు.. క్రమశిక్షణ కూడా ఉండాలి… ముఖ్యంగా గ్రౌండ్ లో ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి… ప్రత్యర్థి బ్యాటర్ ను ఔట్ చేసినా అతన్ని ఎగతాళి చేయడం సరికాదు.. ఈ విషయంలో ఒక్కోసారి యువ ఆటగాళ్ళు కాస్త హద్దు మీరి ప్రవర్తించి తొలి తప్పు కావడంతో పెద్దగా పట్టించుకోరు.. కానీ ఒకటే తప్పు పదే పదే చేస్తుంటే మాత్రం విమర్శలు ఎదుర్కోవడం తప్పదు. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రథి ఇలాంటి ప్రవర్తనతోనే చివాట్లు తింటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉలంఘించినందుకుగానూ గత మ్యాచులో భారీ ఫైన్, ఓ డిమెరిట్ పాయింట్.. అయినా కూడా అతడి తీరు మారలేదు. మళ్లీ ప్రత్యర్థితో అదే ప్రవర్తన తీరు ప్రవర్తించి మరోసారి విమర్శలకు గురయ్యాడు. అతడే దిగ్వేశ్ రథి. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచులోనూ అతడు తన అద్భుత ప్రదర్శనతో పాటు కాంట్రవర్సీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని హాట్ టాపిక్‌గా మారాడు.
ఈ మ్యాచు విజయంలో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ కూడా కీలకంగా వ్యవహరించాడు. అతడు నమోదు చేసిన 1/21 మ్యాచ్ ఫలితంపై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే దిగ్వేశ్ రథి.. రెండో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లోనే నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. మొదటగా ఛేధనలో వికెట్లు పడి ముంబయి ఒత్తిడిలోకి వెళ్లిపోయిన సందర్భంలో నమన్ ధీర్ చెలరేగి ఆడాడు. దీంతో పవర్ ప్లేలో చివరికి ముంబయి కాస్త కోలుకుంది. అయితే ఈ క్రమంలోనే దూకుడు మీదున్న నమన్ ను దిగ్వేశ్ ఔట్ చేసి గట్టిగా దెబ్బ కొట్టాడు. మొదట శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా తరహాలో చిన్నగా డ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ వెంటనే ధీర్ వైపు చూస్తూ తన నోట్‌బుక్ పై రాస్తున్నట్టుగా చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది.
మ్యాచ్ అనంతరం రిఫరీ దీనిపై చర్యలు తీసుకున్నారు. దిగ్వేశ్ కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు విధించారు. గత మ్యాచులోనూ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేసిన దిగ్వేశ్.. అతడి దగ్గరికి పరుగెత్తుకు వెళ్లి మరీ సైన్ అండ్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడు గ్రౌండ్ లోనే ఫీల్డ్ అంపైర్ అతన్ని మందలించారు. తర్వాత ఓ డీమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు మ్యాచు ఫీజులో 25 శాతం కోత విధించారు. ఇప్పుడు రెండోసారి అదే తరహా తప్పు చేయడంతో ఫైన్ రెట్టింపు చేసి రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు. టాలెంట్ ఉన్న ప్రత్యర్థి ఆటగాళ్ళ పట్ల హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు దిగ్వేశ్ కు సూచిస్తున్నారు.