స్టార్ పేసర్ ఎంట్రీ లక్నో రాత మారేనా ?
ఐపీఎల్ 18వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ గత మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ గత మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడింది. ఢిల్లీతో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ఆ జట్టు.. సన్‌రైజర్స్‌పై ఘన విజయాన్నందుకుంది. తర్వాత హోంగ్రౌండ్ లోనే పంజాబ్ కింగ్స్‌తో చిత్తయ్యింది. ఈ క్రమంలోనే ముంబైతో మ్యాచ్ ద్వారా మళ్ళీ గెలుపు బాట పట్టాలనుకుంటోంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో -0.150 రన్ రేట్‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కెప్టెన్ రిషభ్ పంత్.. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు లక్నో జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టులోకి కీలక ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ లక్నో క్యాంపులోకి జాయిన్ అయ్యాడు. అతడు జట్టుతో కలిసిన వీడియోను ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆకాశ్ దీప్ హోస్ లోకి వచ్చేశాడు అని రాసుకొచ్చింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో వెన్నునొప్పితో బాధపడ్డ ఆకాశ్ 2024 డిసెంబర్ నుంచి బరిలో దిగలేదు. గత ఐపీఎల్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని అతను ఇప్పుడు కోలుకున్నాడు.
చివరగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆకాశ్ ఆడాడు. మొత్తంగా 2022 నుంచి ఫ్రాంచైజీ తరఫున కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ కు ముందు లక్నో ఫ్రాంచైజీ అతడిని 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్ సాధించిన ఆకాశ్ టీమ్ తో చేరాడు. గాయాలతో సతమతమవుతున్న లక్నోకు ఆకాశ్ చేరిక పెద్ద ఊరటనిచ్చేదే. గత డిసెంబర్లో గాయానికి గురైన ఫాస్ట్ బౌలర్ మోసిన్ ఖాన్ ఐపీఎల్ 2025 సీజన్ కే దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. అయితే గత సీజన్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ సీజన్ చివరిలో మాత్రమే అతను అందుబాటులో ఉంటాడు.
ఇదిలా ఉంటే లక్నో ఓటములతో పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు. 27 కోట్లు పెట్టి కొంటే కనీసం మ్యాచ్ కు 20 రన్స్ అయినా చేయలేకపోతున్నాడంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అటు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా పంజాబ్ పై ఓటమి తర్వాత గ్రౌండ్ లో హాట్ డిస్కషన్ పెట్టడం కూడా వైరల్ అయింది. బ్యాటింగ్ లో లక్నో స్టార్లు అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోతున్నారు. బౌలింగ్ లోనూ కీలక బౌలర్లంతా నిరాశపరుస్తుండడం లక్నోకు మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ ఎంట్రీతోనైనా లక్నో ఆటతీరు గాడిన పడుతుందేమో చూడాలి.