లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ సగం మ్యాచ్ లకు మయాంక్ ఔట్
ఐపీఎల్ 18వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో ఈ సమ్మర్ క్రికెట్ కార్నివాల్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి.

ఐపీఎల్ 18వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో ఈ సమ్మర్ క్రికెట్ కార్నివాల్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెటర్లు కూడా తమ తమ ఐపీఎల్ జట్లతో చేరిపోయారు. ఇదిలా ఉంటే సీజన్ ఆరంభానికి ముందు పలు జట్లకు ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కు బుమ్రా గాయం షాకిస్తే… తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా షాక్ తలిగింది. ఆ జట్టు యువ పేసర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో అతను ఫస్టాఫ్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.
మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్.. 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ సిరీస్‌లో అతని వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో గత 6 నెలలుగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
మయాంక్ యాదవ్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024 సీజన్ లో మయాంక్ యాదవ్ లక్నో తరపున నాలుగు మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. రెండేళ్ల కిందటే మయాంక్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 మెగా వేలంలో లక్నో అతన్ని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో అతనికి ఒక్క అవకాశమూ రాలేదు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముంది గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలా అని లక్నో అతన్ని వదులుకోలేదు. తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ మరుసటి మ్యాచ్‌లోనే మరో మూడు వికెట్లు తీసి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
కానీ పక్కటెముకల గాయంతో నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్నా మయాంక్ యాదవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ నమ్మకం ఉంచి 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ యువ ఫాస్ట్ బౌలర్ పై చాలా అంచనాలు ఉన్నాయి . గాయం నుంచి కోలుకుని ఎప్పుడు ఐపీఎల్ లోకి అడుగుపెడతాడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.