RCBని నేనొదల.. మళ్ళీ కొనుక్కుంటారన్న మాక్సీ

ఐపీఎల్ మెగా వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రిటెన్షన్ ప్రొసీజర్ కూడా ముగిసింది. ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ తమ పరిధిలో ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 7, 2024 | 01:30 PMLast Updated on: Nov 07, 2024 | 1:30 PM

Maxwell Interested To Play With Rcb

ఐపీఎల్ మెగా వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రిటెన్షన్ ప్రొసీజర్ కూడా ముగిసింది. ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ తమ పరిధిలో ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాయి. పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే… మరికొన్నినలుగురిని , ఇంకొన్ని ఆరుగురిని కొనసాగించుకున్నాయి. అయితే ఐపీఎల్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి టైటిల్ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే రిటెన్షన్ లోనూ ఆచితూచి అడుగులు వేసింది. కేవలం ముగ్గురుని మాత్రమే తమతో అట్టిపెట్టుకున్న ఆర్సీబీ కీలక ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసింది. మాక్స్ వెల్, డుప్లెసిస్, సిరాజ్, క్రిస్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్స్ ను కూడా ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. ఈ నేపథ్యంలో తమ పాత ప్లేయర్స్ లో ఎంతమందిని తిరిగి తీసుకుంటుందనేది చూడాలి.

తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని చెప్పాడు. వేలంలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు. రిటెన్షన్‌ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదన్నాడు. ఈసారి పర్సు వాల్యూ 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్‌ తర్వాత ఆర్సీబీ దగ్గర 83 కోట్లు ఉన్నాయి. వారు ఏం చేయబోతున్నారో తనకు పూర్తిగా అర్థమైందన్న మాక్సీ పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని అసలు విషయం వెల్లడించాడు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్సీబీకి స్ఠానిక ఆటగాళ్ళపై కొన్ని సూచనలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ అన్న మాక్స్ వెల్ అక్కడి వారితో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. రిటెన్షన్‌ సమయంలోనూ తనకు వారి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. గత వేలంలో 11 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ 17వ సీజన్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్‌ టూ మ్యాచ్‌ కార్డు ద్వారా తిరిగి దక్కించుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా కింగ్‌ విరాట్‌ కోహ్లితో మాక్సీకి మంచి ఫ్రెండ్ షిప్ ఉండడంతో అతన్ని తిరిగి జట్టులోకి తీసుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా సిటీ జెడ్డాలో జరుగుతుంది.