మోర్కెల్ ఇంట విషాదం ఇంటికెళ్ళిపోయిన బౌలింగ్ కోచ్

ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్దిగంటలో ప్రారంభం కానుండగా... భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్న టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 02:20 PMLast Updated on: Feb 19, 2025 | 2:20 PM

Morkels Father Passed Away Morne Morkel Went Home After His Father Died Suddenly

ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్దిగంటలో ప్రారంభం కానుండగా… భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్న టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్ కు సన్నద్ధమవుతుండగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకోవడమే దీనికి కారణం. మోర్కెల్ తండ్రి కన్నుమూశారు. తండ్రి హఠాన్మరణంతో మోర్నీ మోర్కెల్‌ స్వదేశానికి పయనమయ్యాడు. అతను తిరిగి భారత జట్టుతో ఎప్పుడు కలుస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. మోర్నీ లేని లోటు టీమిండియా పేస్‌ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 40 ఏళ్ల మోర్కెల్ గతేడాది సెప్టెంబర్‌లో భారత పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్‌ విభాగం మరింత పటిష్టమైంది. మోర్నీ అండర్‌లో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో యువ పేసర్‌ హర్షిత్‌ రాణా సత్తా చాటాడు. మోర్నీ ఆథ్వర్యంలోనే హర్షిత్‌ కూడా రాటుదేలాడు.

మోర్కెల్ ఛాంపియన్స్ ట్రోఫీకి అసలు అతడు అందుబాటులోకి వస్తాడో లేదో అనేది చూడాలి. ఇప్పటికే స్టార్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి గాయం వల్ల దూరమవడం భారత్‍కు పెద్ద లోటు. ఇప్పుడు పేస్ భారం ఎక్కువగా మహమ్మద్ షమీపై ఉంది. అతడు కూడా గాయం నుంచి కోలుకొని ఇటీవలే జట్టులోకి వచ్చాడు. అర్షదీప్ సింగ్‍కు టీ20ల్లో మంచి రికార్డు ఉన్నా.. వన్డేలకు కొత్తే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పేస్ దళం ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో బౌలింగ్ కోచ్ మోర్కల్ కూడా దూరం కావడం భారత్‍కు ఎదురుదెబ్బగానే చెప్పాలి.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవలే స్వదేశంలో ఇంగ్లండ్‍ను వన్డే సిరిస్‍లో 3-0తో చిత్తు చేసింది. కీలక ఆటగాళ్ళందరూ ఫామ్ లోకి రావడంతో కాన్ఫిడెన్స్ పెరిగిన రోహిత్ సేన టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. ఇంగ్లండ్‍తో సిరీస్‍లో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‍లోకి రావడం జట్టుకు పెద్ద బలంగా చెప్పొచ్చు. అలాగే కోహ్లీ, రాహుల్ కూడా టచ్ లోకి వచ్చారు. ఇక శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ కూడా ఇంగ్లాండ్ తో సిరీస్ లో దుమ్మురేపారు. వీరంతా అంచనాలకు తగ్గట్టు రాణిస్తే మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అన్ని మ్యాచ్‍లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.