MS Dhoni: చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్ బై.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

అత్యధిక కాలం ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు దోని సొంతం. తన సారథ్యంలో ధోని.. చెన్నై జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. పదహారు ఐపీఎల్ సీజన్లలో చెన్నై జట్టును 10సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2024 | 04:31 PMLast Updated on: Mar 21, 2024 | 4:31 PM

Ms Dhoni Steps Down As Csk Captain Ruturaj Gaikwad Announced As Replacement

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎమ్మెస్ ధోని తప్పుకొన్నాడు. ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో వచ్చే సీజన్‌లో రుతురాజ్ చెన్నై కెప్టెన్‌గా ఉండటం ఖాయమైంది. ధోని ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుతోనే ఉన్నాడు. అది కూడా 2008 నుంచి 2023 వరకు చెన్నై జట్టు కెప్టెన్‌గా కొనసాగాడు. అత్యధిక కాలం ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు దోని సొంతం.

Rohit Sharma: అంతా నార్మల్ అయినట్టేనా.. రోహిత్‌ను కౌగిలించుకున్న హార్దిక్

తన సారథ్యంలో ధోని.. చెన్నై జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. పదహారు ఐపీఎల్ సీజన్లలో చెన్నై జట్టును 10సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిది. అలాగే చెన్నై 12సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. ఐదుసార్లు ట్రోఫీ గెలుచుకుని, ఛాంపియన్‌గా నిలిచింది. తాజా నిర్ణయానికి సంబంధించి ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. నిజానికి ధోనీ వారసుడిగా రుతురాజ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. గతంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అందించినా ఫలితం లేకపోయింది. సారథిగా జడ్డూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సీజన్ మధ్యలో ధోనీనే మళ్లీ పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. గత సీజన్‌లో ధోనీ తన కూల్ కెప్టెన్సీతో చెన్నైని ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సీజన్‌లో కూడా అతనే టీమ్‌ను లీడ్ చేస్తాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆరంభ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం ప్రకటించింది జట్టు యాజమాన్యం. కాగా ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఆటగాడిగా ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక సారథిగా కూడా అతనికి దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉంది.

మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్, పూణె, స్థానిక టీ20 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దాదాపు ధోనీ లాగే బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా పెద్దగా టెన్షన్ లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా వివాదాల్లో చిక్కుకోని ఆటగాడి పేరు కూడా రుతురాజ్ సొంతం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా, ఆసియా క్రీడలకు భారత జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ నియమితులయ్యాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతనికే ధోనీ వారసత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి సీజన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. రుతురాజ్‌ను ఈ సీజన్ ధోనీ వెనుక ఉండి నడిపిస్తాడని ఫాన్స్ చెబుతున్నారు. ఐపీఎల్ 2024 ట్రోఫీతో, వివిధ జట్ల కెప్టెన్లతో నిర్వహించిన ఫొటో షూట్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో ధోని ఆటగాడిగా మాత్రమే చెన్నై జట్టుకు సేవలందిస్తాడు.