MSK Prasad: అందుకే ఆంధ్ర ప్రదేశ్ కు ఐపిఎల్ జట్టు లేదు
దేశంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తెలంగాణ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ఆంధ్రకు కూడా ఓ ఐపీఎల్ టీమ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ ఓ ఐపీఎల్ టీమ్ కొనబోతున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేకపోవడానికి గల కారణాన్ని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్ కే ప్రసాద్ వెల్లడించాడు. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరఫున ఉండదన్నాడు. తాజాగా ఓ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదని ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చాడు. ‘దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్‌కింగ్స్, కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కటే ఉంది. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు.
ఆ మధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్ నడిచింది.’అని ఎం ఎస్ కే చెప్పుకొచ్చాడు. ఇక ఫ్రాంచైజీ లీగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ముప్పు వచ్చే అవకాశం ఉందని ప్రసాద్ హెచ్చరించాడు. ఐపీఎల్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలన్నాడు. ‘ఐపీఎల్ కమర్షియల్ టోర్నమెంట్. ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐకి కూడా నష్టం జరుగుతుంది. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు.’అని ఎమ్మెస్కే తెలిపాడు