MSK Prasad: సెలెక్షన్ సమయంలో ప్రతివాడు పండితుడే.. ఎమ్మెస్కే ప్రసాద్..!
ప్రపంచకప్ కోసం గతేడాదిగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్ల కన్నా బయటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లంతా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే జట్టును ప్రకటిస్తారని, ఎవరి వ్యక్తిగతా ఏజెండాలు పనిచేయవని స్పష్టం చేశాడు.

MSK Prasad: వన్డే ప్రపంచకప్ 2023 అనగానే ప్రతీ ఒక్కడు సెలెక్టర్ అయిపోతాడని, క్రికెట్ గురించి అక్షర జ్ఞానం తెలియని వాడు కూడా జట్టు ఎంపిక గురించి మాట్లాడుతాడని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌లో మాట్లాడిన ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేశాడు. బయటి వ్యక్తులు జట్టు ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించాడు.
జట్టు గురించి ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. ప్రపంచకప్ కోసం గతేడాదిగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్ల కన్నా బయటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లంతా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే జట్టును ప్రకటిస్తారని, ఎవరి వ్యక్తిగతా ఏజెండాలు పనిచేయవని స్పష్టం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీనే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. అప్పట్లో ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపింది.
ప్రెస్‌మీట్‌లో త్రీ డైమన్షన్ ఆటగాడంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం.. త్రీడీ కళ్లద్దాలతో అతని ఆటను చూస్తానని రాయుడు ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఈ వ్యవహారం ఎమ్మెస్కేను వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే టీమ్ ఎంపిక గురించి మాట్లాడేవారిపై కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌ను తీసుకుంటే జట్టుకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు.