Mumbai Indians : ముంబై… బై..బై తప్పు జరిగింది అక్కడే

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కథ ముగిసింది...ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2024 | 02:43 PMLast Updated on: May 04, 2024 | 2:43 PM

Mumbai Bye Bye The Mistake Happened There

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కథ ముగిసింది…ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అవుతుందని ఆశ పెట్టుకున్న అభిమానులను నిరాశపరుస్తూ వరుస ఓటములతో రేసు నుంచి తప్పుకుంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) తో మ్యాచ్‌లో 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోవడంతో అధికారికంగా ముంబై ప్లే ఆఫ్ రేసుకు దూరమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఈ సారి ఏదీ కలిసి రాలేదు.

ఆ జట్టు పేలవ ప్రదర్శనకు కారణాలను చూస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్సీ మార్పు గురించే… గుజరాత్ సారథిగా ఉన్న హార్థిక్ పాండ్యాను ట్రేడింగ్‌లో భారీ మొత్తం వెచ్చించి జట్టులోకి తిరిగి తీసుకొచ్చింది. వచ్చీరాగానే రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించి హార్థిక్‌కు పగ్గాలు అప్పగించింది. దీనిపై ముంబై ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు జట్టులో కొంతమంది ప్లేయర్స్ కూడా రోహిత్‌కే పరోక్షంగా మద్దతు పలికారు. ఫలితంగా జట్టు రెండు వర్గాలుగా చీలినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఈ ప్రభావం దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ కనిపించింది. ముఖ్యంగా హార్థిక్ టాస్‌కు వచ్చినప్పుడు, ఫీల్టింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ రోహిత్..రోహిత్ అంటూ గేలి చేయడం అతన్ని సైకలాజికల్‌గా దెబ్బతీసింది. అదే సమయంలో కెప్టెన్‌గా హార్థిక్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అద్భుతమైన బౌలింగ్‌ వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడు. పలు సందర్భాల్లో స్టార్ పేసర్ బూమ్రాను కూడా సరిగ్గా వాడుకోలేదని విమర్శలు వచ్చాయి. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌ విషయంలోనూ హార్థిక్ వ్యూహత్మకంగా వ్యవహరించేదన్న విమర్శ ఉంది.

ఇక వ్యక్తిగతంగా తన ఆల్‌రౌండ్ ట్యాగ్‌కు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఇటు బ్యాట్‌తోనూ, అటు బంతితోనూ స్థాయికి తగినట్టు రాణించలేదు. జట్టులో మిగిలిన విభాగాలను చూస్తే ప్రధానంగా బ్యాటింగ్‌ విషయంలో నిలకడ లేమి ముంబై పేలవ ప్రదర్శనకు మరో కారణం. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అనుకున్న స్థాయిలో రాణించలేదు. అలాగే సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, పాండ్యా కూడా విఫలమయ్యారు. తిలక్ వర్మ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా నిలకడలేమితోనే ఇబ్బందిపడడం ముంబైని దెబ్బతీసింది.

ఇక బౌలింగ్‌లోనూ ముంబై తేలిపోయింది. స్టార్ పేసర్ బూమ్రా , సౌతాఫ్రికా బౌలర్ కొయెట్జీ తప్పిస్తే మిగిలిన బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా భారీస్కోర్లు సమర్పించుకున్నారు. ఇలా అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శనతో సెకండాఫ్‌లోనూ ముంబై పుంజుకోలేకపోయింది. గత సీజన్లలో పలుసార్లు ఆరంభ మ్యాచ్‌లలో ఓడినా తర్వాత పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నా సెకండాఫ్‌లోనూ అదే పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్ రేసుకు దూరమైంది. మరి మిగిలిన మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవప్రదంగా సీజన్‌ను ముగిస్తుందేమో చూడాలి.