రోహిత్ పైనే సస్పెన్స్ ముంబై రిటైన్ ప్లేయర్స్ వీళ్ళే
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి...
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ చివర్లో ఆటగాళ్ళ వేలం జరగనుండగా… వచ్చే వారంలో బీసీసీఐ రిటెన్షన్ కు సంబంధించి నిబంధనలు ఖరారు చేసే అవకాశముంది. అయితే ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ రిటైన్షన్ జాబితాపై తర్జనభర్జన పడుతున్నాయి. దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ పైనే అందరి దృష్టీ ఉంది. తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై రిటైన్ చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన తర్వాత హిట్ మ్యాన్ ముంబై జట్టులో అంత సౌకర్యంగా లేడని వార్తలు వస్తున్నాయి. రోహిత్ ను రిటైన్ చేసుకోవడంపై ముంబై కూడా ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం.
కాగా ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను చూస్తే కెప్టెన్ హార్థిక్ పాండ్యాను కొనసాగించడం ఖాయమని చెప్పొచ్చు. గత సీజన్ లో జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయినప్పటకీ పాండ్యాపై ముంబైకి నమ్మకం తగ్గలేదని తెలుస్తోంది. అలాగే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ను కూడా రిటైన్ చేసుకునే అవకాశముంది. సూర్యకుమార్ కు జట్టు పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు వస్తుండగా.. కోల్ కతా ఫ్రాంచైజీ ట్రేడింగ్ కోసం అతన్ని సంప్రదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబై అతన్ని వదులుకునే అవకాశాలు లేనట్టే. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మను కూడా ముంబై రిటైన్ చేసుకోవడం ఖాయం. తిలక్ వర్మ గత సీజన్ లో 400కు పైగా పరుగులు చేసి ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాను కూడా ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు.