అన్నకు తగ్గ తమ్ముడు సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన ముషీర్
భారత్ లో క్రికెట్ టాలెంట్ కు కొదవ లేదు.. అండర్ 19 స్థాయి నుంచే ఎంతో మంది యువ క్రికెటర్లు దుమ్మురేపుతూ ఉంటారు.
భారత్ లో క్రికెట్ టాలెంట్ కు కొదవ లేదు.. అండర్ 19 స్థాయి నుంచే ఎంతో మంది యువ క్రికెటర్లు దుమ్మురేపుతూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా అండర్ 19 స్థాయి నుంచే ప్రస్తుతం స్టార్ క్రికెటర్లుగా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తొలి అడుగులు వేస్తున్నాడు. సర్ఫ్ రాజ్ ఖాన్ తమ్ముడిగా అభిమానులకు తెలిసిన ముషీర్ ఖాన్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో అదరగొట్టేస్తున్నాడు.ఇండియా బి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. సీనియర్ బ్యాటర్లంతా చేతులెత్తేసిన స్థితిలో 19 ఏళ్ళ ఈ వన్ డౌన్ బ్యాటర్ పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.
ఈ ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ముషీర్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్‌లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.అంతేకాదు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ అధిగమించాడు. దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా రైజింగ్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్న ముషీర్ సచిన్‌ను దాటేశాడు. సర్ఫ్ రాజ్ ఖాన్ ను తరహాలోనే స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకుంటున్న ముషీర్ అన్నను మించిన తమ్ముడు అవుతాడంటూ ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.