చిక్కుల్లో భారత పేసర్ షమీపై ముస్లిం పెద్దల ఫైర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్న భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చిక్కుల్లో పడ్డాడు. ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 03:50 PMLast Updated on: Mar 07, 2025 | 3:50 PM

Muslim Elders Fire At Indian Pacer Shami In Trouble

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్న భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చిక్కుల్లో పడ్డాడు. ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. రంజాన్ ఉపవాస దీక్ష నిబంధనలు అతను పాటించడం లేదంటూ పలువురు ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ విరామ సమయంలో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం పై అతివాద ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమీ పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్ లో ఉందని.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ ఎనర్జీ డ్రింక్ తాగి పెద్ద పాపం చేశాడని ఆరోపించాడు.

ఈ పాపానికి షమీని అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. ముస్లిం సమాజం రంజాన్ ఉపవాసం పాటిస్తున్న సమయంలో షమీ ఇలా చేయడం ఏంటని మండిపడుతూ ఓ వీడియోని విడుదల చేశారు. షరియత్ దృష్టిలో అతడు నేరస్తుడుంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు. మరోవైపు ముస్లిం సంఘాలు చేసిన వ్యాఖ్యలపై షమీ కుటుంబ సభ్యులు స్పందించారు. భారత్ ఓటమిని కోరుకునే వాళ్లు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే ముస్లిం మత పెద్దల వ్యాఖ్యలపై పలువురు అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. సాధారణంగా క్రీడాకారులు మైదానంలో ఆడుతున్నపుడు గ్లూకోజ్ వాటర్ లేదా మరేదైనా డ్రింక్స్ తాగుతారు. బాడీ అలసిపోకుండా ఉండేందుకు ఎనర్జీ కోసం ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆట ఆడుతున్నపుడు దాహం వేసినా ఎనర్జీ డ్రింక్ తాగకపోతే అది డీహైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే క్రీడాకారులు మైదానంలో కాస్త బ్రేక్ తీసుకుని మరీ డ్రింక్స్ తాగుతారు. అయితే ఇప్పుడు అలా చేసినందుకే షమీ చిక్కుల్లో పడ్డాడు. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షను ముస్లింలు చాలా కఠినంగా అనుసరిస్తారు. మంచినీళ్ళు కూడా తాగకుండా నియమాలు పాటిస్తారు. కానీ షాబుద్దీన్ బరేల్వి షమీని విమర్శించినా నెటిజన్స్ మాత్రం ఈ టీమిండియా పేసర్ ను అభినందిస్తున్నారు. మతం కంటే దేశానికే ఎక్కువ గౌరవం ఇచ్చినందుకు అతనిపై ప్రశంసలు కురిపించారు.