వన్డేల్లో నయా కింగ్ నెంబర్ 1 బ్యాటర్ గా గిల్

ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత్ జట్టుకు అదిరిపోయే న్యూస్... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్ శుభమన్ గిల్ అదరగొట్టాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 01:50 PMLast Updated on: Feb 20, 2025 | 1:50 PM

Naya King Became The Number 1 Batsman In Odis

ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత్ జట్టుకు అదిరిపోయే న్యూస్… ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్ శుభమన్ గిల్ అదరగొట్టాడు. తాజా జాబితాలో నెంబర్ వన్ ర్యాంకుు కైవసం చేసుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజాంను వెనక్కి నెట్టిన గిల్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఈ యువ బ్యాటర్ పరుగుల వరద పారించాడు. మూడు వన్డేల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో దుమ్మురేపాడు. సిరీస్ లో 86 యావరేజ్ తో 259 పరుగులు చేయగా.. దీనిలో 37 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుతమైన ఫామ్ లోకి వచ్చిన గిల్ ఇంగ్లాండ్ పై చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గానూ నిలిచాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అదరగొట్టడంతో మూడో ర్యాంకు నుంచి టాప్ ప్లేస్ కు వచ్చేశాడు. పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ రెండో స్థానానికి పడిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ తన ఫామ్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా మరికొంతకాలం కొనసాగుతాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్‌కు టాప్‌ బాబర్‌కు మధ్య కేవలం 12 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్‌ ఖాతాలో 773 పాయింట్లు,రోహిత్‌ ఖాతాలో 761 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ తన ఫామ్ కంటిన్యూ చేస్తే సెకండ్ ప్లేస్ కు చేరే అవకాశముంది. ఇదిలా ఉంటే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ లో రాణించిన భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు.

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌ లో రషీద్‌ ఖాన్‌ టాప్ ప్లేస్ ను కోల్పోయాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో అదరగొట్టిన మహీశ్‌ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని అగ్ర స్థానానికి చేరుకున్నాడు. నమీబియా బౌలర్‌ బెర్నార్డ్‌ స్కోల్జ్‌ రెండు స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌లో నిలిచాడు. భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ నాలుగో ర్యాంకులో ఉండగా..
పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది ఐదో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే టీమిండియాలో చోటు కోల్పోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో భారత్‌ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్‌ టెన్ లో ఉన్నారు. రవీంద్ర జడేజా 13వ ర్యాంకులోనూ, మహ్మద్ షమీ 15వ స్థానంలోనూ నిలిచారు. ఇక వన్డే ఫార్మాట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా 28వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.