గిల్ , పంత్ కు నో ఛాన్స్ ,నాసిర్ హుస్సేన్ ఫ్యాబ్-4 వీరే
ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్ళు వచ్చినా కొందరే ప్రత్యేకముద్ర వేస్తుంటారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా నిలకడగా రాణించే సత్తా కూడా కొందరికే ఉంటుంది. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తే ఆ ఆటగాడిని గొప్ప క్రికెటర్ గానే పరిగణస్తుంటారు.
ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్ళు వచ్చినా కొందరే ప్రత్యేకముద్ర వేస్తుంటారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా నిలకడగా రాణించే సత్తా కూడా కొందరికే ఉంటుంది. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తే ఆ ఆటగాడిని గొప్ప క్రికెటర్ గానే పరిగణస్తుంటారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్,జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరిని ప్రస్తుత క్రికెట్ లో ఫ్యాబ్ 4 గా పరిగణిస్తారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు. అయితే టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్టులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. యువ ఆటగాళ్ళలో చాలా మంది రెడ్ బాల్ క్రికెట్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ కొందరు ఆటగాళ్ళు మాత్రం టెస్టుల్లోనూ సత్తా చాటుతున్నారు. కోహ్లీ, స్మిత్, విలియమ్సన్, రూట్ ఈ నలుగురూ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఫ్యాబ్ ఫోర్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ ఫ్యూచర్ ఫ్యాబ్ ఫోర్ పై తన అంచనాలను పంచుకున్నాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, పాకిస్థాన్ యువ సంచలనం సైమ్ అయూబ్, టీమిండియా ఓపెనర్ జైశ్వాల్ ను ఫ్యూచర్ ఫ్యాబ్ 4 గా హుస్సేన్ ఎంపిక చేశాడు. బ్రూక్ 2024లో టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున 1000కి పైగా పరుగులు చేశాడు. దీనిలో పాకిస్థాపై ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై సెంచరీలు బాదాడు. మరోవైపు ఇటీవలే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి జైశ్వాల్.. టెస్ట్, టీ20 ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు. గత డబ్ల్యూటీసీ సీజన్ లో పరుగుల వరద పారించాడు. 36 ఇన్నింగ్స్ లలో 52కు పైగా సగటుతో 1798 రన్స్ చేశాడు. జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరోవైపు ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు మూడు ఫార్మాట్ లలో కీలక ప్లేయర్ గా మారాడు. డబ్ల్యూటీసీ సీజన్ లో 31 ఇన్నింగ్స్ లలో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ నలుగురినీ ఫ్యూచర్ ఫ్యాబ్ ఫోర్ గా నాసిర్ హుస్సేన్ అంచనా వేశాడు. ఆశ్చర్యకరంగా అతని ఫ్యాబ్ ఫోర్ లిస్ట్ లో టీమిండియా యువ సంచలనం గిల్ కు చోటు దక్కలేదు. అలాగే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను సైతం పక్కన పెట్టాడు.