నో డౌట్ స్పిన్నర్లే విన్నర్లు, దుబాయ్ పిచ్ రిపోర్ట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరింది. ప్రతీ మ్యాచ్ లోనూ ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బంగ్లాదేశ్ , పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై లీగ్ స్టేజ్ లో గెలిచిన భారత్ సెమీఫైనల్లో కంగారూలను చిత్తు చేసింది. అటు న్యూజిలాండ్ కూడా టైటిల్ రేసులో దూసుకొచ్చింది. పాక్ పర్యటనలో ట్రై సిరీస్ గెలిచిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొట్టింది. భారత్ తప్పిస్తే మిగిలిన జట్లపై గెలిచి సెమీస్ లో సఫారీలను నిలువరించి ఫైనల్ కు చేరింది. ఇరు జట్ల బలాబలాల , ఫామ్ చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఫైనల్ కు ఎలాంటి పిచ్ రెడీ చేస్తున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ పోరుకు పాకిస్తాన్ తో ఆడిన పిచ్ నే సిద్ధం చేసినట్టు సమాచారం. దీంతో ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత సులభం కాదు. నిజానికి పాక్ లో పిచ్ లన్నీ ఫ్లాట్ ఉండడంతో ప్రతీ మ్యాచ్ లో 300 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. కానీ దుబాయ్ పిచ్ లపై మాత్రం స్పిన్నర్లే ఆధిపత్యం కనబరుస్తున్నారు. దుబాయ్ పిచ్ మొదట్నుంచి స్పిన్ ఫ్రెండ్లీగానే ఉంది. వన్డేల్లో ఎక్కువగా స్పిన్నర్లకే మద్దతు లభిస్తూ ఉంటుంది. పేసర్లకు శ్రమిస్తే వికెట్లు దక్కుతాయి. చాంపియన్స్ ట్రోఫీలోని గత 4 మ్యాచుల్లోనూ ఎక్కువగా స్పిన్నర్లే ప్రభావం చూపారు. కివీస్ పై వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అదరగొట్టాడు.
ఇక్కడ పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఒక్కో రన్ కోసం బ్యాటర్లు శ్రమించడం గత మ్యాచుల్లో చూశాం. బాల్ పిచ్ మీద పడ్డాక బ్యాట్ పైకి నెమ్మదిగా వస్తోంది. కాబట్టి బిగ్ షాట్స్ కొట్టడం కష్టమవుతోంది. వికెట్ కాపాడుకోవడం, స్ట్రైక్ రొటేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి హార్దిక్ పాండ్యా కివీస్‌పై చేసినట్లు ఆఖర్లో దంచుడు షురూ చేస్తే బెనిఫిట్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అటు టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు ఎక్కువ సార్లు గెలిచాయి. ఇప్పటివరకు దుబాయ్‌లో 59 వన్డేల్లో 23 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ నెగ్గగా.. 36 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. అందుకే టాస్ నెగ్గితే బౌలింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చు. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచింది. అందులో రెండు సార్లు చేజ్ చేసి విక్టరీ కొట్టింది. అయితే ఫైనల్లో ఉండే ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
దుబాయ్ పిచ్‌లో హయ్యెస్ట్ స్కోరు 285. అది కూడా భారత్‌దే. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 219. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 193. తొలుత బ్యాటింగ్ చేస్తే 250 ప్లస్ సేఫ్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ చేజింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని 220 లోపు కట్టడి చేయాల్సిందే… న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్ లో భారత్ 249 పరుగుల స్కోరును సక్సెస్ ఫుల్ గా కాపాడుకుంది.