Cricket: పన్ను మినహాయింపుకు నో ఛాన్స్..ఆ మొత్తం బీసీసీఐ కట్టాల్సిందే..!
వన్డే ప్రపంచకప్ ఆతిథ్య ఏర్పాట్లపై బీసీసీఐ సన్నాహాలు ఊపందుకున్నాయి. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే 12 వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
మెగా టోర్నీ ఫైనల్ కు అహ్మదాబాద్ మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబయిలలో మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే రెండు విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వీటిలో మొదటిది పాక్ క్రికెటర్ల వీసాలకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా పాక్ తో భారత్ కు ద్వైపాక్షిక సంబంధాలు లేవు. ఇటు క్రికెట్ లోనూ ప్రభుత్వ సూచనల మేరకే నడుస్తున్న బీసీసీఐ పాక్ తో ఎటువంటి సిరీస్ లూ ఆడడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే ఆ జట్టుతో తలపడుతోంది.
అలాగే భారత్ లో ఇతర క్రీడలకు సంబంధించి పాక్ జట్లకు కూడా పలు సందర్భాల్లో వీసాలు నిరాకరించడం, కొన్ని సందర్భాల్లో పాక్ జట్లే ఇక్కడ ఆడేందుకు విముఖత చూపించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ కు మాత్రం వీసాల విషయంలో బీసీసీఐ ఐసీసీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసాలకు క్లియరెన్స్ ఇప్పిస్తామని ఐసీసీకి బీసీసీఐ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.
అలాగే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులకు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలోనూ బీసీసీఐకి ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో సర్ చార్జీల రూపంలో కట్టాల్సిన మొత్తాన్ని బీసీసీఐ భరించాల్సి ఉంటుంది. ఐసీసీతో ఉండే ఒప్పందం ప్రకారం ఆతిథ్య దేశం తమ ప్రభుత్వం మాట్లాడి పన్ను మినహాయింపు ఇప్పించాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీనికి సుముఖంగా లేదు. 2016 టీ ట్వంటీ ప్రపంచకప్ సమయంలోనూ ఐసీసీకి 160 కోట్ల పన్ను భారం పడింది. అప్పట్లోనే ఐసీసీ,బీసీసీఐ మధ్య కాస్త విభేదాలు వచ్చాయి.
ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదరువుతుండడంతో బీసీసీఐ సొంతంగా పన్ను మినహాయింపు భారాన్ని చెల్లించాలని ఐసీసీ ముందే స్పష్టం చేసింది. ఇటు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంతో 964 కోట్ల రూపాయలను బీసీసీఐనే చెల్లించనుంది. ప్రపంచకప్ కు ఇంకా ఆరు నెలల సమయమే ఉండడంతో ఈ రెండు సమస్యలను దాదాపుగా బీసీసీఐ పరిష్కరించుకున్నట్టే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఐసీసీ ఆమోదం తర్వాత టోర్నీ వేదికలను అధికారికంగా ప్రకటించనుండగా.. అక్టోబర్, నవంబర్ లలో ఉండే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఫైనలైజ్ చేయనున్నారు.
మొత్తం 10 జట్లు పాల్గొనే వన్డే వరల్డ్ కప్ లో 46 రోజుల పాటు 48 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని టీమిండియా ఈ సారి సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు