భార్యలకు,గాళ్ ఫ్రెండ్స్ కు నో పర్మిషన్ భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెటర్లకు బీసీసీఐ షాకిచ్చింది. ఈ మెగా టోర్నీకి సింగిల్ గానే వెళ్ళాలని ఆదేశించింది. ఎవ్వరూ కూడా తమ భార్య లేదా గాళ్ ఫ్రెండ్స్ ను తీసుకురావొద్దని స్పష్టం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 07:35 PMLast Updated on: Feb 14, 2025 | 7:35 PM

No Permission For Wives And Girlfriends Is A Shock For Indian Cricketers By Bcci

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెటర్లకు బీసీసీఐ షాకిచ్చింది. ఈ మెగా టోర్నీకి సింగిల్ గానే వెళ్ళాలని ఆదేశించింది. ఎవ్వరూ కూడా తమ భార్య లేదా గాళ్ ఫ్రెండ్స్ ను తీసుకురావొద్దని స్పష్టం చేసింది. నిజానికి ఈ కొత్త రూల్ ఆసీస్ టూర్ వైఫల్యంతోనే తెరపైకి వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం అమలు చేసే విషయంలో ఛాంపియన్స్ ట్రోఫీనే తొలి టోర్నీ కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో ఓటమి పాలయ్యాక.. బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనిలో క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్ల గురించే ముఖ్యమైన నిబంధన తెచ్చింది. టీమిండియా విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల ఉండడంపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. టోర్నీ 45 రోజుల కంటే ఎక్కువ రోజులైతే.. భాగస్వామి, పిల్లలు రెండు వారాలు ఉండొచ్చు. 45 రోజుల కంటే తక్కువైతే.. కేవలం వారం రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం 15 రోజుల టోర్నీ కనుక బీసీసీఐ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

దీనిపై పలువురు సీనియర్ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పలువురు ఆటగాళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేయగా.. ఇదే విషయంపై చీఫ్ సెలక్టర్ అగార్కర్ తో అతను పలుసార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది. కానీ బీసీసీఐ మాత్రం రూల్స్ విషయం వెనక్కి తగ్గలేదు. గతంలో రోహిత్ శర్మను ఇదే అంశంపై ప్రశ్నించగా.. మీడియాపై చిందులు తొక్కాడు. బోర్డు అధికారికంగా ప్రకటించలేదు కదా అంటూ మాట్లాడాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరో రెండురోజుల్లో బయలుదేరనున్న వేళ కొత్త రూల్స్ పై ఆటగాళ్ళకు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి మేనేజర్ గా ఎంపికైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ ను పిలిచి కొత్త రూల్స్ ను వివరించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ రూల్స్ అమలు చేసే విషయంలో ఎలాంటి అలసత్వం ఉండొద్దని కూడా ఆయనకు తేల్చి చేప్పినట్టు సమాచారం.

మిగిలిన రూల్స్ ను చూస్తే మ్యాచ్‌లు, పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు విడివిడిగా గాకుండా.. జట్టుతో కలిసి ప్రయాణించాలి. బ్యాగేజీ విషయంలోనూ ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు పరిమితికి మించి బ్యాగేజీ తీసుకొస్తే.. అందుకు అయ్యే ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. ఇక సిరీస్‌లకు ఆటగాళ్లు తమ వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్‌, అసిస్టెంట్స్‌, సెక్యూరిటీని తీసుకురావడంపై నిషేధం విధించింది. దీనికి బీసీసీఐ అనుమతి తప్పనిసరి. ఈ రూల్స్ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జట్టుకు ఎంపికైన ప్రతీ ప్లేయర్ పాటించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది.