Ayesha Naseem: నా వయసు 18.. కానీ, మతం కోసం రిటైర్ అవుతున్నా
ఇంత చిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఆమె చెప్పిన కారణం మాత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాను ఇస్లాం మతాచారాల ప్రకారం జీవించాలనుకుంటున్నానని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అయేషా వెల్లడించింది.

Ayesha Naseem: పాకిస్థాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ 18 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు తన రిటైర్‌మెంట్‌ను ధృవీకరించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుని సంప్రదించింది. అయేషా నసీమ్ అత్యంత చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
నిజానికి ఈ వయసులోనే తమని తాము నిరూపించుకునేందుకు ఎక్కువ మంది క్రికెటర్లు తహతహలాడుతుంటారు. అయేషా మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత చిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఆమె చెప్పిన కారణం మాత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాను ఇస్లాం మతాచారాల ప్రకారం జీవించాలనుకుంటున్నానని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అయేషా వెల్లడించింది.
15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అయేషా పాకిస్థాన్ మహిళల జట్టు తరపున నాలుగు వన్డేలు, 30 టీ20లు ఆడింది. 4 వన్‌డేలలో 33 పరుగులు చేసింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో 369 పరుగులు చేసింది. 2020లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అయితే ఈ యువ క్రికెటర్ నిర్ణయానికి ప్రపంచ క్రికెట్ లోకం నివ్వెరపోతోంది.