సొంతగడ్డపై ఘోరఅవమానం మెగాటోర్నీ నుంచి పాక్ ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకుందామని బోలెడు ఆశలు పెట్టుకున్న ఆ జట్టు కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకుందామని బోలెడు ఆశలు పెట్టుకున్న ఆ జట్టు కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి ఇంటిదారి పట్టింది. భారత్ పై మ్యాచ్ ఓడిపోవడంతోనే పాక్ కథ దాదాపుగా ముగిసింది. కానీ న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ గెలిచి సంచలనం సృష్టిస్తుందేమోనంటూ ఎదురుచూసిన పాక్ ఆశలు నెరవేరలేదు. 237 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో కివీస్ 3 కీలక వికెట్లు త్వరగానే కోల్పోయినా రచిన్ రవీంద్ర సెంచరీతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. దీంతో గ్రూప్ ఏ నుంచి పాక్ , బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. ఇదే గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. బంగ్లా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రంగానే మిగిలింది. ఇదిలా ఉంటే భారత్, కివీస్ మధ్య జరిగే మ్యాచ్ తో గ్రూప్ ఏ టాప్ ప్లేస్ ఎవరికో తేలుతుంది.
ఇదిలా ఉంటే సొంతగడ్డపై జరిగిన మెగాటోర్నీలో పాకిస్తాన్ ఇంత త్వరగా నిష్క్రమించడం ఆ జట్టు అభిమానులకు మింగుడుపడడం లేదు. ఇంతకంటే ఘోర అవమానం మరొకటి లేదంటూ వాపోతున్నారు. తమ జట్టు ఐర్లాండ్, జింబాబ్వేలతో సిరీస్ లు ఆడుకోవడం మంచిదంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక పాక్ మాజీ ఆటగాళ్ళయితే ఓ రేంజ్ లో పాక్ క్రికెట్ బోర్డును ఆడుకుంటున్నారు. రిజర్వ్ బెంచ్ పై ఫోకస్ లేదని, ప్రతిభ ఆధారంగా జట్టు ఎంపిక జరగడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. తమ దేశంలో క్రికెట్ చచ్చిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.. సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పోరులో ఇండియా చేతిలో చిత్తయిన జట్టుపై మాజీ ఆటగాళ్లు దుమ్మొత్తిపోస్తున్నారు. పాక్ జట్టులో సరైన విధానం, వైఖరి, ప్రణాళిక ఏదీ లేదన్న లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్.. 2026 టీ20 వరల్డ్ కప్‌నకు ముందు టీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
జట్టులోని ముగ్గురు పేసర్లు షాహీన్ ఆఫ్రిది, నసీమ్, రవూఫ్‌పై వేటు వేయాలని మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ డిమాండ్ చేశాడు. సెలెక్టర్లు, పెద్దల అండతో జట్టులోకి వస్తున్న ఆటగాళ్లు ఏం చేస్తున్నారో చూస్తున్నామని ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ బోర్డుకు కొత్త టెన్షన్ మొదలైంది. తమ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాక్ లో జరిగే మిగిలిన మ్యాచ్‌లకు కూడా అభిమానులు స్టేడియానికి వస్తారో రారో అని పీసీబీ టెన్షన్ పడుతోంది. ఒకవేళ ప్రేక్షకులు స్టేడియానికి రాకపోతే బ్రాడ్ కాస్టర్లకు ఎదురౌతాయి. ఈ పరిణామం భవిష్యత్ లో పాక్ క్రికెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పీసీబీలో ఆందోళన మొదలైంది. ఎంతో లాబీయింగ్ చేసుకుని, భద్రత విషయంలో వెనక్కి తగ్గకుండా ఐసీసీని ఒప్పించి మరీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తుండగా.. ఇలాంటి పరిస్ఖితి రావడం పీసీబీకి సైతం మింగుడుపడడం లేదు.