భారత్ జెర్సీపై పాక్ పేరు మెగాటోర్నీ కోసం న్యూ లుక్

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 05:20 PMLast Updated on: Feb 19, 2025 | 5:20 PM

Pakistans Name On Indias Jersey Is A New Look For The Megatournament

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. లాహోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో ఆడే టీమిండియా ప్రిపరేషన్ లో బిజీగా ఉంది. ఒకవైపు ప్రాక్టీస్ లో బిజీగా ఉంటూనే కొత్త జెర్సీలతో టోర్నీ కోసం ఫోజులిచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఆటగాళ్ళు వేసుకోబోయే జెర్సీలపై పాకిస్తాన్ పేరుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఆతిథ్య జట్టుతో ఉన్న లోగోను జెర్సీలపై ముద్రిస్తారు. కానీ ఈ సారి బీసీసీఐ.. తమ జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్‌లో తాము ఆడటం లేదని, అందుకే పాక్ పేరును తమ జెర్సీ, కిట్ లపై ముద్రించాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే, ఐసీసీ జోక్యం చేసుకోవడం వల్ల ఈ వివాదం ముగిసింది.

అందుకే తాజాగా బీసీసీఐ.. తమ కొత్త ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించి ఆవిష్కరించింది. అలానే ఈ కొత్త జెర్సీతో మన ఆటగాళ్లు ఐసీసీ అవార్డులు అందుకుంటున్న ఫొటోలను తమ అధికార సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
రోహిత్ శర్మ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోగా.. జడేజా టెస్ట్ టీం ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ‘టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులను అందుకున్నారు. అలాగే, మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ పురస్కారాన్ని కూడా అర్షదీప్ అందుకున్నాడు. కాగా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా – పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది.కొత్త జెర్సీలతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్ మన్ గిల్, రిషభ్‌ పంత్‌, మహమ్మద్‌ షమీ తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫొటోలకు పోజులిచ్చారు.

ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు వివాదానికి దారితీసింది. కరాచిలోని జాతీయ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఐసీసీ సూచనల మేరకే జెండాలు ఏర్పాటు చేశామని పీసీబీ వివరణ ఇచ్చింది. మ్యాచ్ లు జరిగే రోజు నాలుగు జెండాలు మాత్రమే ఎగరేయాలని ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని పీసీబీ తెలిపింది. ఐసీసీ చెప్పినట్లు పీసీబీ పాటిస్తే మ్యాచ్ రోజుల్లో నాలుగు జెండాలు మాత్రమే ఎగరేయాలి. కానీ ఇంకా టోర్నీ ఆరంభం కాకముందే కరాచి జాతీయ స్టేడియంలో భారత్ మినహా టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల పతాకాలను ఆవిష్కరించారు. మరి మిగతా దేశాల పతాకాలు ఎందుకు ఎగరవేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ కు వెళ్లేందుకు టీమ్ఇండియా నిరాకరించడంతో ప్రతీకార చర్యగా పీసీబీ ఇలా వక్రబుద్ధి ప్రదర్శించిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.