Cricket World Cup: పగ తీర్చుకుంటాం: పాకిస్థాన్.. పీకేదెం లేదు: బీసిసిఐ
భారత క్రికెట్ అభిమానులు ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో అయినా టీమిండియా సత్తా చాటుతుందని, కప్పు కొట్టి ఐసీసీ ట్రోఫీ గెలవని కరువు తీరుస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటించడంలో మాత్రం ఐసీసీ ఆలస్యం చేస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మొదలవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టోర్నీ షెడ్యూల్ డ్రాఫ్ట్‌ను బీసీసీఐ ఇప్పటికే తయారు చేసింది. దీన్ని ఐసీసీకి కూడా పంపింది. ఈ టోర్నీలో పాల్గొనే సభ్య దేశాలకు దీన్ని పంపిన ఐసీసీ.. ఆయా దేశాలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వల్లనే షెడ్యూల్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం, క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
ఇక్కడ లక్ష మందికిపైగా ప్రేక్షకులు హాజరయ్యే వీలుంటుంది. అందుకే ఈ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఇక్కడ ఆడటానికి అభ్యంతరం చెప్తోందట. ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించామని, భద్రతా కారణాల దృష్ట్యా గవర్నమెంట్ ఆమోదం పొందిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని పీసీబీ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. భారత్‌కు వెళ్లడంపై ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పీసీబీ చెప్తోంది.
అయితే ఈ షెడ్యూల్‌పై తమ అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి పీసీబీకి ఐసీసీ కొంత సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గడువు లోపు పీసీబీ స్పందించకపోతే.. ఇదే షెడ్యూల్‌ను ఐసీసీ ఖరారు చేస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలోనే బీసీసీఐ ఈ షెడ్యూల్ తయారు చేసింది. ఆ సమయంలోనే ప్రకటించాలని కూడా అనుకుంది. కానీ ఆసియా కప్ విషయంలో బీసీసీఐ మొండిపట్టుకు పగ తీర్చుకోవాలని అనుకున్న పీసీబీ.. అభ్యంతరాలు లేవనెత్తింది. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌కు ముందు ఆమోదం కావాలని పట్టుబట్టింది. తాజాగా ఏసీసీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 31 నుంచి ఆసియా కప్ మొదలవుతుందని ప్రకటించింది. కొన్ని మ్యాచులు పాకిస్తాన్‌లో, మిగతావి శ్రీలంకలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ షెడ్యూల్‌పై కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.