ఇక ఇంటికెళ్ళి ఆడుకోండి పాక్ ను ప్యాకప్ చేసిన భారత్
వరల్డ్ క్రికెట్ లోనే బిగ్గెస్ట్ రైవలరీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్... ఈ రెండు జట్లు ఎప్పుడు ఏ ఫార్మాట్ లో తలపడినా ఉండే క్రేజే వేరు... ఓవరాల్ గా ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ ఆధిపత్యమే ఎక్కువగా ఉంది.

వరల్డ్ క్రికెట్ లోనే బిగ్గెస్ట్ రైవలరీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్… ఈ రెండు జట్లు ఎప్పుడు ఏ ఫార్మాట్ లో తలపడినా ఉండే క్రేజే వేరు… ఓవరాల్ గా ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ పైచేయి సాధించింది. 2017 ఫైనల్లో మనపై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. అప్పటి నుంచీ రివేంజ్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా దానిని నెరవేర్చుకుంది. అది కూడా మామూలు దెబ్బ కొట్టలేదు… పాక్ ను చిత్తు చేయడమే కాదు ఏకంగా టోర్నీ నుంచే వారిని ఇంటికి పంపించేసింది. పాక్ ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీలో కనీసం వారిని సెమీస్ కు కూడా క్వాలిఫై కాకుండా చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలపుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ సారి సీన్ రివర్స్… భారత్ కు షాకిస్తాం అంటూ విర్రవీగిన పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ కు ఆటతోనే జవాబిచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ ను ఓడించిన రోహిత్ సేన సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించిన భారత్ పాక్ పైనా అదరగొట్టింది.
ఫేవరెట్ గా బరిలోకి దిగి తమపై ఉన్న అంచనాలకు తగ్గట్టే రాణించి చిరకాల ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా… బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టారు. హోరాహోరీ పోరు ఖాయమనుకున్న ఫ్యాన్స్ కు షాకిస్తూ పాకిస్తాన్న పెద్దగా పోటీనివ్వలేకపోయింది. దుబాయ్ పిచ్ పై రెగ్యులర్ ఆడే పాక్ బ్యాటర్లు అక్కడ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. సౌద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. 43 ఓవర్ల వరకు ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ నమోదు కాలేదంటే మన బౌలర్లు ఎలా కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన కుష్దీల్ షా.. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి ఓవర్‌లో కుష్దీల్ షాను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. దుబాయ్ లోని స్లో పిచ్ పై టీమిండియా పేసర్లు, స్పిన్నర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు అక్షర్, జడేజా, కుల్ దీప్ పాక్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాక్ 241 పరుగులకే కుప్పకూలింది.
స్లో పిచ్ కావడంతో ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచుదామనుకున్న పాక్ పై మన ఓపెనర్లు రోహిత్ , గిల్ కౌంటర్ ఎటాక్ చేశారు. రోహిత్ 20 రన్స్ కు ఔటైనా గిల్ , కోహ్లీ పార్టనర్ షిప్…తర్వాత కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ పార్టనర్ షిప్ మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేసింది. గిల్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా… రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి పాక్ జట్టుపై తన డామినేషన్ కంటిన్యూ చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా తన ఫామ్ కొనసాగించాడు. ఈ ఇద్దరినీ పాక్ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. వన్డేల్లో ఎలా ఆడితే గెలుస్తామో మన బ్యాటర్లు నిరూపించారు. ఫలితంగా 242 పరుగుల టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతామంటూ హడావుడి చేసిన పాక్ బౌలర్లు తోకముడిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అదరగొట్టిన తీరు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళిన భారత్ సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. అటు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ లో మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడుతుంది.