రూ. 27 కోట్ల బిడ్డింగ్, పంత్ తో అట్లుంటది మరి
ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజే రికార్డుల సునామీ కనిపించింది. ఊహించినట్టుగానే వేలంలోకి వచ్చిన పలువురు స్టార్ ప్లేయర్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అనుకున్నట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజే రికార్డుల సునామీ కనిపించింది. ఊహించినట్టుగానే వేలంలోకి వచ్చిన పలువురు స్టార్ ప్లేయర్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అనుకున్నట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. పంత్ ను ఏకంగా రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అసలు పంత్ కోసం పోటీ ఓ రేంజ్ లో నడిచింది. కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం గట్టిగానే ప్రయత్నించడంతో కొద్దిసెకన్లలోనే ధర 10 కోట్లు దాటిపోయింది.
ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. ఇంత ధర చెల్లించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇష్టపడలేదు. దీంతో రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక బిడ్ కు అమ్ముడైన ప్లేయర్ గా పంత్ రికార్డు సృష్టించాడు. గత మినీ వేలంలో మిఛెల్ స్టార్క్ కోసం కోల్ కత్తా వెచ్చించిన 24.75 కోట్లే ఇప్పటి వరకూ హయ్యెస్ట్ బిడ్ గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.
అలాగే ఒక భారత క్రికెటర్ కు 20 కోట్ల పైన బిడ్ రావడం ఇదే తొలిసారి. ఇదే వేలంలో శ్రేయాస్ అయ్యర్ కూడా 26.75 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించాడు. అయితే యాజమాన్యంతో విభేదాల కారణంగా ఢిల్లీ నుంచి బయటకొచ్చిన పంత్ కోసం ఆ ఫ్రాంచైజీ ఆర్టీఎం ట్రై చేయడం ఆశ్చర్యపరిచింది. ఢిల్లీ టీమ్ నుంచి బయటకు రావడానికి కారణం డబ్బు కాదనీ పంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కోచ్ ఎంపికతో పాటు ఇతర విషయాల్లో డీసీ మేనేజ్ మెంట్ తో విభేదించి బయటకొచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అందరి అంచనాలు నిజం చేస్తూ పంత్ రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఇప్పుడు కెఎల్ రాహుల్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కు పంత్ కెప్టెన్సీ చేయబోతున్నాడు.