నన్నెందుకు తీసుకోరు గంభీర్ ను నిలదీసిన పంత్

ప్రస్తుతం టీమిండియాలో ప్రతీ ప్లేస్ కూ తీవ్రమైన పోటీ ఉంది... సెలక్షన్ కమిటీ 15 మందిని ఎంపిక చేయడం ఒక టాస్క్ అయితే ప్రతీ మ్యాచ్ కు ముందు తుది జట్టు ఎంపిక మరో పెద్ద టాస్క్.. ఈ క్రమంలో కొందరు కీలక ప్లేయర్స్ ను సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 01:10 PMLast Updated on: Feb 20, 2025 | 1:10 PM

Panth Serious On Gambhir

ప్రస్తుతం టీమిండియాలో ప్రతీ ప్లేస్ కూ తీవ్రమైన పోటీ ఉంది… సెలక్షన్ కమిటీ 15 మందిని ఎంపిక చేయడం ఒక టాస్క్ అయితే ప్రతీ మ్యాచ్ కు ముందు తుది జట్టు ఎంపిక మరో పెద్ద టాస్క్.. ఈ క్రమంలో కొందరు కీలక ప్లేయర్స్ ను సైతం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. అయితే ఇలా పక్కన పెట్టేవిషయంలో జట్టులో విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూ, కోచ్ గౌతమ్ గంభీర్ తో గట్టిగానే గొడవ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఈ విభేదాలు తలెత్తినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. గంభీర్ వ్యవహార శైలిపై డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తుది జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై గంభీర్‌ను రిషభ్ పంత్ నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది.

పంత్‌ను కాదని గంభీర్‌.. రాహుల్‌కు ప్రాధాన్యత ఇస్తుండటం అతనికి ఆగ్రహం తెప్పించినట్లు ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో తన సామర్థ్యాలను వివరిస్తూ పంత్.. గంభీర్‌ను నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే తమ కథనంలో ఎక్కడా కూడా రిషభ్ పంత్‌ను పేరును ప్రస్తావించకుండా వికెట్ కీపర్‌గా పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పంత్‌తో పాటు రాహుల్‌ మాత్రమే వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌‌లోని కాంబినేషన్‌నే దాదాపు కొనసాగించనున్నారు. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులు కేఎల్ రాహుల్‌కు టీమిండియా ప్రాధాన్యం ఇచ్చింది. మిడిలార్డర్‌లో ఆడగలడని, రిషభ్ పంత్ గైర్హాజరీలో వన్డే ప్రపంచకప్ 2023లో రాహుల్ మెరుగ్గా రాణించాడని అతన్నే కీపర్‌గా కొనసాగించింది.

తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన రాహుల్.. ఆఖరి వన్డేలో కీలక ఇన్నింగ్స్‌తో టచ్‌లో వచ్చాడు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్‌నే వికెట్ కీపర్‌గా కొనసాగించనున్నారు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే స్పష్టం చేశాడు. వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ చాయిస్‌ రాహులేనని మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు. నిజావికి గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రిషభ్ పంత్‌కు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. గంభీర్ అతన్ని టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేశాడు. టీ20ల్లో సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా కొనసాగిస్తున్న గంభీర్.. వన్డేల్లో ఇప్పుడు కేఎల్ రాహుల్‌‌ను ఆడిస్తున్నాడు. అయితే రాహుల్ కంటే పంత్‌ ప్రమాదకరమైన బ్యాటర్. మిడిలార్డర్‌లో ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించగలడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు. గతంలో అతను గెలిపించిన మ్యాచ్ లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పంత్ రాకతో జట్టులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తోంది. కానీ గంభీర్ మాత్రం కెఎల్ రాహుల్ కే ప్రయారిటీ ఇస్తుండడంతోనే పంత్ కు కోపం వచ్చి వాగ్వాదం పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.