Pat Cummins: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. మార్క్‌రమ్ స్థానంలో కమ్మిన్స్‌కు సారథ్య బాధ్యతలు

ఐపీఎల్‌ 2024 వేలంలో భాగంగా ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా రూ.20.50 కోట్లు ఖర్చు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ పేస్‌ బౌలర్‌ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించించి. తాజాగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 02:07 PMLast Updated on: Mar 04, 2024 | 2:07 PM

Pat Cummins Officially Unveiled As Captain Of Sunrisers Hyderabad

Pat Cummins: ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. గత సీజన్‌లో సారథిగా వ్యవహరించిన సౌతాఫ్రికా స్టార్‌ మార్క్‌రమ్‌‌ను కమిన్స్‌తో భర్తీ చేసింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ను నడిపించిన మార్క్‌రమ్ తన మార్క్‌ను చూపలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ నాలుగింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

REVANTH REDDY: కేంద్రంతో వైరం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.. పెద్దన్నలా మోదీ సహకరించాలి: సీఎం రేవంత్

ఈ నేపథ్యంలో సరైన సారథి వేటలో పడిన సన్‌రైజర్స్‌.. ఐపీఎల్‌ 2024 వేలంలో భాగంగా ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా రూ.20.50 కోట్లు ఖర్చు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ పేస్‌ బౌలర్‌ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించించి. తాజాగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించింది. కాగా 2016లో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో వార్నర్‌పై వేటు వేయగా ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వార్నర్‌ స్థానంలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా తీసుకువచ్చినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఐపీఎల్‌ 2022 ఎడిషన్‌లో పద్నాలుగింట కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడంతో ఈ మేరకు కేన్‌ మామపై వేటు వేసింది. అతడి స్థానంలో ఐడెన్‌ మార్క్‌రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అయినప్పటికీ సన్‌రైజర్స్ రాత మారలేదు సరికదా మరింత పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంది. గతేడాది పద్నాలుంగిట కేవలం నాలుగు మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. తాజాగా మరోసారి కెప్టెన్సీ మార్పుతో హైదరాబాద్ తలరాత మారుతుందేమో చూడాలి. కాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మార్చి 23న జరుగనున్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ 17వ సీజన్ ప్రయాణాన్ని ఆరంభించనుంది.