కోహ్లీనే మొనగాడు పాంటింగ్ ప్రశంసలు

ప్రపంచ క్రికెట్ లో గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఒకపేరే చెప్పడం చాలా కష్టం.. ఎందుకంటే 150 ఏళ్ళ క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 05:00 PMLast Updated on: Feb 26, 2025 | 5:00 PM

Ponting Praises Kohli

ప్రపంచ క్రికెట్ లో గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఒకపేరే చెప్పడం చాలా కష్టం.. ఎందుకంటే 150 ఏళ్ళ క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేశారు. బ్రాడ్ మన్ నుంచి కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గంగూలీ, ధోనీ వరకూ ఎంతోమంది అద్భుతంగా రాణించారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు. ఈ క్రమంలో ఒక్కరినే గ్రేటెస్ట్ గా పేర్కొనడం కొంచెం కష్టంగా మారింది. కానీ ప్రస్తుత తరంలో మాత్రం గ్రేటెస్ట్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ పేరే చెబుతానంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్… పాకిస్తాన్ తో మ్యాచ్ లో సెంచరీ ద్వారా మళ్ళీ ఫామ్ అందుకున్న కోహ్లీపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో కోహ్లీ నిలకడగా చాలా కాలం నుంచి రాణిస్తున్నాడని కొనియాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై విరాట్ సెంచరీ బాది పాంటింగ్ వన్డే పరుగుల రికార్డును అధిగమించాడు.

దీనిపై స్పందించిన పాంటింగ్ విరాట్ ను ఆకాశానికెత్తేశాడు. చాలా కాలం నుంచి అతడు ఛాంపియన్ గా కొనసాగుతున్నాడన్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్ లో అతడు అద్భుతమైన ప్లేయర్ గా కితాబిచ్చాడు.. వన్డేలో విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని తాను ఇప్పటి వరకూ చూడలేదన్నాడు. వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా కోహ్లీ గుర్తిండిపోవడానికి తనకు తానే ఓ గొప్ప అవకాశం ఇచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు పాంటింగ్ పేర్కొన్నాడు. వన్డేల్లో కోహ్లీ ఇటీవలే 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ 18,426 పరుగులతో ముందున్నాడు. అయితే సచిన్ రికార్డును కోహ్లీ దాటే అవకాశం ఉందని రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు ఉంటే, అతడిని ఎవరూ వదులుకోరన్నాడు. ఎందుకంటే ఫిజికల్ గా కోహ్లీ ఇంకా ఫిట్ గానే ఉన్నాడనీ గుర్తు చేశాడు. ఇంకా ఆట కోసం కష్టపడుతూ అసాధారణమైన ప్రదర్శన చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

మరో రెండేళ్ళు కోహ్లీలో పరుగుల దాహం ఉంటే మాత్రం ఖచ్చితంగా సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని అంచనా వేశాడు. కాగా పాకిస్థాన్ తో జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ ఎంతో బాధ్యతగా ఆడుతూ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. వన్డేల్లో 51 వ సెంచరీని నమోదు చేశాడు.