West Indies: ‘విండి’పాళ్యంలా తయారయింది సూపర్ ఓవర్లో 30 పరుగులు
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్ జట్టుకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జింబాబ్వే చేతిలో ఘోర ఓటమిని చవి చూసిన ఆ జట్టు.. తాజాగా నెదర్లాండ్స్ చేతిలో కూడా పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు సాధించింది. ఆ జట్టు కీలక ఆటగాడు నికోలస్ పూరన్ 65 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించడంతో వెండీస్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు మంచి ఆరంభం లభించింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ అంతా వేగంగా పరుగులు సాధించినా.. వికెట్స్ నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. కానీ.., మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తేజ నిడమనూరు 76 బంతుల్లోనే 111 పరుగులు సాధించి నెదర్లాండ్స్ జట్టుని విజయం ముంగిట నిలిపాడు.
ఇక చివరి ఓవర్ లో విజయానికి 9 పరుగులు చేయాల్సి ఉండగా.. నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ “లోగాన్ వాన్ బీక్” మొదటి బంతినే బౌండరీ కొట్టి.. ఆల్మోస్ట్ విజయాన్ని ఖరారు చేశాడు. కానీ.., చివరి మూడు బంతుల్లో 3 పరుగులే రావడంతో మ్యాచ్ మ్యాచ్ టై అయ్యి.. సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ విధ్వంసం సృష్టించింది. హోల్డర్ ఓవర్ లో స్ట్రైక్ తీసుకున్న నెదర్లాండ్ పవర్ హిట్టర్ “లోగాన్ వాన్ బీక్” వరుస బౌండరీస్ తో హోరెత్తించాడు. మొదటి బాల్ నే సిక్స్ గా మలిచిన “వాన్ బీక్”.. చివరి బంతి వరకు ఆ ఊచకోతని కొనసాగించాడు. ఆ ఓవర్ లోని ఆరు బంతుల్లో వరుసగా 4, 6, 4, 6, 6, 4 రావడంతో వెస్టిండీస్ చావు దెబ్బ తిన్నట్టు అయ్యింది.
ఇక అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన వెండీస్ సూపర్ ఓవర్ లో కేవలం 8 పరుగులే సాధించి బోల్తా పడింది. ఈ ఓటమితో వెస్టిండీస్ వరల్డ్ కప్ ఆశలు మరింత క్లిష్టంగా మారింది. ఆ జట్టు తదుపరి రౌండ్ కు చేరినా.. మిగతా మ్యాచ్ లు అన్నీ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పటి ప్రపంచ ఛాంపియన్ కు ఇలాంటి అవమానకరమైన పరిస్థితి ఏర్పడటంతో అంతా షాక్ కు గురి అవుతున్నారు. ఇక సూపర్ ఓవర్ లో ఏకంగా 30 రన్స్ సాధించిన “లోగాన్ వాన్ బీక్” ఓవర్ నైట్ హీరో అయిపోయాడు.