PRO KABADDI: కబడ్డీ కూతకు రెడీయా.. నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్..
తొమ్మిదేళ్లుగా అశేషంగా అభిమానులను అలరించిన ఈ లీగ్‌కు శనివారం తెరలేవనుంది. మొత్తం 12 జట్లు టైటిల్ కోసం కబడ్డీ కూత పెట్టనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్‌తో టోర్నీ షురూ కానుంది.

PRO KABADDI: వన్డే ప్రపంచకప్ 2023తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో మునిగి తేలిన జనాలను అలరించేందుకు ప్రో కబడ్డీ సిద్దమైంది. పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొడుతూ.. చిరుతలా ప్రత్యర్థిపై పడుతూ.. సంప్రదాయ క్రీడను మన భాషలో సరికొత్తగా చూపించేందుకు ప్రో కబడ్డీ సీజన్ 10 రెడీ అయ్యింది. గత తొమ్మిదేళ్లుగా అశేషంగా అభిమానులను అలరించిన ఈ లీగ్‌కు శనివారం తెరలేవనుంది. మొత్తం 12 జట్లు టైటిల్ కోసం కబడ్డీ కూత పెట్టనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్‌తో టోర్నీ షురూ కానుంది.
రాత్రి 8 గంటలకు తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ జట్లు తలపడనున్నాయి. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్స్‌లో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీని ప్రస్తుత కాలం తగ్గట్లు మార్పులు చేసి అభిమానుల ఆసక్తిని మరింత పెంచేలా ప్రోకబడ్డీ లీగ్‌ను రూపొందించారు. 2004లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్ (2014, 2022), యు ముంబా(2015), పట్నా పైరేట్స్(2016-ఫిబ్రవరి, 2016 జులై, 2017), బెంగళూరు బుల్స్(2018), బెంగాల్ వారియర్స్(2019), దబాంగ్ ఢిల్లీ(2021) ఇప్పటి వరకు విజేతలుగా నిలిచాయి. తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు టైటిల్ అందుకోలేదు.
ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 132 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 12 ఫ్రాంచైజీలకు చెందిన 12 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని బృందాలు ఒక్కో నగరంలో తలో 6 రోజుల పాటు ఉంటాయి. మొదటి 6 రోజులు అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ తేదీలు ఇంకా ప్రకటించలేదు. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.