మీ బతుక్కి ఐపీఎల్ తో పోటీనా ? పీఎస్‌ఎల్ షెడ్యూల్ ప్రకటించిన పీసీబీ
ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్లే... స్టార్ క్రికెటర్ల నుంచి స్పాన్సర్ల వరకూ... ఫ్రాంచైజీల నుంచి వ్యూయర్ షిప్ వరకూ ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు...

ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్లే… స్టార్ క్రికెటర్ల నుంచి స్పాన్సర్ల వరకూ… ఫ్రాంచైజీల నుంచి వ్యూయర్ షిప్ వరకూ ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు… ఈ రిచ్చెస్ట్ లీగ్ కు ఉన్న ఫాలోయింగే వేరు.. ఇలాంటి లీగ్ తో పోటీపడాలని మిగిలిన దేశాలు కూడా పోటీపడినా ఐపీఎల్ ను మాత్రం చేరుకోలేకపోయాయి. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తమ జట్టు స్పాన్సర్ల కోసమే వెతుక్కునే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ను చూసి కాలుదువ్వుతోంది. ఎప్పుడూ ఫిబ్రవరి, మార్చి నెలలో లీగ్ కంప్లీట్ చేసే పాక్ బోర్డు ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ జరిగే టైంలోనే తమ లీగ్ ను నిర్వహించబోతోంది. పీఎస్ఎల్ పదో సీజన్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగుతుంది.
పీఎస్ఎల్ లో ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇక ఈ లీగ్ లో బరిలో దిగే విదేశీ క్రికెటర్ల సంఖ్య కూడా తక్కువే. స్టార్ క్రికెటర్లు, డబ్బు, మ్యాచ్ లు, ఆదరణ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఐపీఎల్ కు పీఎస్ఎల్ ఆమడ దూరంలో ఉంటుంది. అలాంటిది ఐపీఎల్ తో పోటీకి దిగుతోంది. అది పీఎస్ఎల్ కే ప్రమాదమన్న సంగతి పీసీబీ గుర్తించడం లేదు. ఏప్రిల్ 11న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ తో రెండు సార్లు విజేత లాహోర్ ఖలందర్స్ తలపడబోతోంది. మే 18న ఫైనల్ జరుగుతుంది. రెండు ఎలిమినేటర్లు, ఫైనల్ సహా 13 మ్యాచ్ లకు గడాఫీ స్టేడియం వేదిక. ఈ లీగ్ మొత్తం మ్యాచ్ ల సంఖ్య 34 మాత్రమే. అలాగే రాబోయే ఎడిషన్లో ఏప్రిల్ 8న పెషావర్లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ను పీసీబీ నిర్వహించనుంది. ఈ మ్యాచ్ లో తలపడే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ కూడా బరిలో దిగుతున్నాయి.
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ 2025 సీజన్ ఫైనల్ మే 25న జరుగుతుంది. ఐపీఎల్ లో 10 జట్లు తలపడతడనుండగా… మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సారి 13 స్టేడియాాలు ఐపీఎల్ 2025 మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తో ఆర్సీబీ పోటీపడుతుంది. కాగా ఐపీఎల్ టైంలో పీఎస్ఎల్ నిర్వహించడం ద్వారా సవాల్ విసిరామని సంబరపడుతున్న పాక్ బోర్డుకు గట్టి షాకే తగిలే అవకాశముంది. మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విదేశీ ఆటగాళ్ళనే పాక్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కానీ వీరిలో ఎంతమంది పాక్ కు వెళ్ళేందుకు ఓకే చెబుతారో అనేది చూడాలి. ఒకవేళ పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమైతే గతంలో వచ్చిన టీవీ ఫ్యూయర్ షిప్ కూడా రాదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.