ఐసీసీ టోర్నీలతో లవ్ ఎఫైర్ , రచిన్ రవీంద్ర అరుదైన రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన కివీస్ తాజాగా బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 02:55 PMLast Updated on: Feb 26, 2025 | 2:55 PM

Rachin Ravindra Is A Rare Record

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన కివీస్ తాజాగా బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన జట్టును సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో రచిన్ చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. రచిన్ రవీంద్రకు ఇదే తొలి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. నిజానికి ఈ యువ ఆటగాడు అసలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమేనని అనుకున్నారు.ట్రై సిరీస్ మ్యాచ్ లో క్యాచ్ పట్టే క్రమంలో బంతి అతని నుదిటికి బలంగా తాకింది. దాంతో ఆ సిరీస్‌ మొత్తానికి దూరమైన రచిన్ రవీంద్ర.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ ఆడలేదు. పూర్తిగా కోలుకోని తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ముందుగా 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్ర.. డెవాన్ కాన్వేతో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. తర్వాత టామ్ లాథమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో శతకం బాదిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర.. సెంచరీతో చెలరేగాడు. అతనికి ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు 19 మంది తమ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే శతకం సాధించారు. కానీ రెండు టోర్నీల్లో అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ రచిన్ రవీంద్ర మాత్రమే.

రచిన్ రవీంద్ర తన కెరీర్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేయగా.. ఆ నాలుగు కూడా ఐసీసీ వేదికలపైనే సాధించాడు. మూడు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023, ఒకటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025. వన్డే వరల్డ్ కప్ డెబ్యూలో 10 ఇన్నింగ్స్‌లలో 578 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున ఐసీసీ ఈవెంట్లపై నాలుగు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కేన్ విలియమ్సన్, నాథన్ మూడు మూడు సెంచరీలు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌పై రచిన్ రవీంద్ర సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లలో టార్గెట్‌ను సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇంటిదారి పట్టాయి.