సెంచరీ చేసినా ప్లేస్ లేదు నేేనేంటో చూపిస్తా
భారత క్రికెట్ లో ఎప్పటికప్పుడు బాగా ఆడుతూ ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది.. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడితే మాత్రం కొంతవరకూ చూసి తర్వాత పక్కన పెట్టేస్తారు.

భారత క్రికెట్ లో ఎప్పటికప్పుడు బాగా ఆడుతూ ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది.. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడితే మాత్రం కొంతవరకూ చూసి తర్వాత పక్కన పెట్టేస్తారు. కానీ ఒక్కోసారి పోటీతత్వం ఎక్కువగా ఉంటే బాగా ఆడినా కూడా జట్టులో చోటు ఉండదు.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు వెటరన్ బ్యాటర్ అజంక్య రహానే… తాజాగా గతంలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందులను ఓపెన్ గా చెప్పేశాడు. ఎంత బాగా ఆడినా కూడా జట్టులో నుంచి పీకేస్తారన్నాడు. రహానే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టీమిండియాలో నిలకడకు మారుపేరైన రహానే ఒక్కసారిగా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. అయితే తాను జట్టుకు దూరమవడంపై రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ చేసినా కూడా జట్టులో చోటు కోల్పోయానని చెప్పాడు. అలా ఎందుకు జరిగిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు.
జట్టు ఎంపిక అనేది తన చేతుల్లో లేదని, అదంతా సెలక్టర్ల పని అంటూ చెప్పుకొచ్చాడు. తాను మాత్రం బాగానే ఆడానని అనుకుంటున్నట్టు సెలక్టర్లకు చురకలు అంటించాడు. జాతీయ జట్టులో అవకాశం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్ తనను ఆదరించిందన్నాడు. కాబట్టి దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం రహానే రంజీ ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ చేసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. మూడుసార్లు 90కిపైగా, ఒకసారి 80కిపైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌పై సంతృప్తికరంగానే ఉన్నానని, ముస్తాక్ అలీ ట్రోఫీతోపాటు రంజీల్లోనూ పరుగులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చన్నాడు. ఇప్పటికైతే రంజీ ట్రోఫీ సెమీస్‌పైనే దృష్టి సారించినట్టు వివరించాడు.
రెడ్ బాల్ క్రికెట్ లో రహానేకు అద్భుతమైన బ్యాటర్ గా పేరుంది. క్లిష్ట సమయంలో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలాగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రీజులో ఒక్కసారి కుదురుకున్నాడంటే రహానేను ఔట్ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు తలనొప్పిగా మారేది. అలాంటి రహానే అవసరం ప్రస్తుతం టీమిండియాకు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న యువ, సీనియర్ ఆటగాళ్ళు టెస్టుల్లో నిలకడగా రాణించలేకపోతున్నారు. టీ ట్వంటీలకు బాగా అలవాటు పడి టెస్టుల్లో ఓపిగ్గా ఆడలేకపోతున్నారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం రహానే లాంటి అనుభవజ్ఞుడైన ప్లేయర్ ఖచ్చితంగా టీమిండియాకు అవసరమని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి సెలక్టర్లు రహానేను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.