రహానేకే కోల్ కత్తా పగ్గాలు ,వైస్ కెప్టెన్ గా వెంకటేశ్ అయ్యర్

ఐపీఎల్ 18వ సీజన్ కోసం కౌంట్ డౌన్ మొదలైన వేళ ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు ప్రారంభించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 03:15 PMLast Updated on: Mar 05, 2025 | 3:15 PM

Rahane Takes The Reins And Venkatesh Iyer As The Vice Captain

ఐపీఎల్ 18వ సీజన్ కోసం కౌంట్ డౌన్ మొదలైన వేళ ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు ప్రారంభించాయి. అటు తమ జట్టు కూర్పుపైనా ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. వచ్చే సీజన్ కోసం టీమిండియా సీనియర్ ప్లేయర్ అజంక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.గత సీజన్‌లో కేకేఆర్‌ను నడిపించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు జట్టును వీడటంతో కొత్త కెప్టెన్‌ను ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన రహానేకు జట్టు పగ్గాలను అప్పగించిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్‌కు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. కొత్త కెప్టెన్ నియామకాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

వెంకటేశ్ అయ్యర్‌ను ఫ్యూచర్ కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని వైస్ కెప్టెన్ గా ఎంపికచేసినట్టు సమాచారం. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌ను నియమిస్తారని ప్రచారం జరిగినా.. మేనేజ్‌మెంట్ అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చింది. టీమిండియాకు దూరమైనా.. దేశవాళీ క్రికెట్‌లో ముంబై సారథిగా రహానే అదరగొడుతున్నాడు. గతేడాది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను రహానే సారథ్యంలోనే ముంబై గెలిచింది.

గతేడాది జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌కతా యాజమాన్యం రహానేను 1.50 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. రహానేపై టెస్ట్ బ్యాటర్‌గా ముద్రపడినప్పటికీ, గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతడిచ్చిన మెరుపు ఆరంభాలు అంత ఈజీగా మరిచిపోలేరు. 13 ఇన్నింగ్స్‌లలో 242 పరుగులు చేశాడు. రహానే మంచి క్లాస్ ప్లేయర్. దీనికితోడు రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతోప్రాంచైజీ అతని వైపు మొగ్గుచూపింది.
ఐపీఎల్‌లో కేకేఆర్‌కు నాయకత్వం వహించిన 8వ కెప్టెన్ రహానే. గతంలో సౌరవ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణాలు కేకేఆర్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

కేకేఆర్ ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా అన్ని జట్ల సారథులు ఎవరో తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగే కొత్త జెర్సీని కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆవిష్కరించింది. మూడు టైటిళ్లు గెలిచామనే విషయం తెలియజేసేలా జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.