అందరినీ షర్ట్స్ విప్పమన్నాడు దాదాపై రాజీవ్ శుక్లా కామెంట్స్
భారత క్రికెట్ లో సారథిగా సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర...జట్టుకు దూకుడు కెప్టెన్ నాయకుడు... ప్రత్యర్థి జట్టుకు ఆటతో పాటు మాటలతోనే ధీటుగా బదులిచ్చేలా టీమ్ ను సిద్ధం చేసిన సారథి దాదానే...
భారత క్రికెట్ లో సారథిగా సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర…జట్టుకు దూకుడు కెప్టెన్ నాయకుడు… ప్రత్యర్థి జట్టుకు ఆటతో పాటు మాటలతోనే ధీటుగా బదులిచ్చేలా టీమ్ ను సిద్ధం చేసిన సారథి దాదానే… ఓపెనర్ గా, కెప్టెన్ గా తన దాదాగిరీతో ప్రత్యేకంగా నిలిచిన గంగూలీ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది లార్డ్స్ లో షర్ట్ విప్పిన ఘటనే.. నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్ చారిత్రక విజయం తర్వాత లార్డ్స్ స్టేడియం బాల్కనీలో దాదా షర్ట్ విప్పి గాల్లో తిప్పిన దృశ్యాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. భారత్ లో ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచినప్పుడు ఆండ్రూ ఫ్లింటాప్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మన బెంగాల్ టైగర్ కి నచ్చలేదు. ఇక దీనికి రివేంజ్ తీర్చుకోవాలని ఆరోజే ఫిక్స్ అయిన దాదా.. వారి సొంత గడ్డపైనే దిమ్మతిరిగే షాకిచ్చాడు.
నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో టీమిండియా 146 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. గంగూలీ, సెహ్వాగ్ తొలి వికెట్ కు సెంచరీ పార్టనర్ షిప్ అందించినా… కీలక సమయంలో సచిన్ , ద్రావిడ్ ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ మ్యాచ్ ని మలుపు తిప్పారు. వీరోచితంగా పోరాడి ఆరో వికెట్ కి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టడంతో మైదానం విజిల్స్, కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లింది. అయితే ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాజాగా బయటపెట్టాడు.
తాను అప్పుడు భారత జట్టు మేనేజర్ గా ఉన్నానని గుర్తు చేసుకున్నాడు. విజయానికి చేరువలో ఉన్నప్పుడు కెప్టెన్ గంగూలి జట్టు మొత్తం షర్టులు విప్పి సంబరాలు చేసుకోవాలని చెప్పాడని శుక్లా గుర్తు చేసుకున్నారు. అయితే దీనిని సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించాడని చెప్పాడు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం గంగూలీ ఒక్కడే తన షర్ట్ విప్పి గాల్లోకి తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడనీ చెప్పుకొచ్చాడు. దాదా ఇలా సెలబ్రేట్ చేయడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎంతైనా దాదా దాదానే ఎక్కడా తగ్గేదే లే అంటూ అప్పుడే నిరూపించాడని ఫ్యాన్స్ చెబుతుంటారు.