రంజీ ట్రోఫీ విజేత ,విదర్భ నెరవేరని కేరళ టైటిల్ కల
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేరళ, విదర్భ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ జట్టు ఛాంపియన్ గా నిలిచింది.

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేరళ, విదర్భ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టుకు ఇది మూడో టైటిల్. గత 7 ఏళ్లలోనే ఈ మూడు టైటిల్ అందుకుంది. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న విదర్భ.. రంజీ ట్రోఫీని మాత్రం కైవసం చేసుకుంది. విదర్భ విజయంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను బ్యాట్‌తో రాణించాడు.
విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 123.1 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. డానిష్ మలెవర్ సెంచరీతో చెలరేగగా.. కరుణ్ నాయర్ తృటిలో శతకం చేజార్చుకున్నాడు. తర్వాత కేరళ తొలి ఇన్నింగ్స్‌లో పోరాడినప్పటకీ ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. 125 ఓవర్లలో 342 పరుగులే చేసింది. కెప్టెన్ సచిన్ బేబీ 2 రన్స్ తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఆదిత్య సర్వతే హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 37 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ సెంచరీతో చెలరేగగా.. డాని మలేవర్ 73, దర్శన్ నల్కండే 51 రన్స్ తో రాణించారు.
ఆటకు చివరి రోజు కావడం విదర్భ తన బ్యాటింగ్ కొనసాగిస్తుండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భను విజేతగా ప్రకటించారు. విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో చెరలేగిన కరుణ్ నాయర్ కీలకమైన ఫైనల్లో మాత్రం తడబడ్డాడు. దాంతో ఆ జట్టు విజయ్ హజారే ట్రోఫీని అందుకోలేకపోయింది. కానీ రంజీ ట్రోఫీ ఫైనల్లో మాత్రం కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన చేసి విదర్భకు టైటిల్ అందించాడు.