Ravichandran Ashwin: అదరగొట్టిన అశ్విన్.. రికార్డులు స్మాష్..!
వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్, ఓపెనర్ త్యాగ్ నారాయణ్ చందర్‌పాల్, అరంగేట్రం ఆటగాడు అలిక్ అథానాజ్, పేసర్ అల్జారీ జోసెఫ్, బౌలర్ జోమెల్ వారికన్ వికెట్లను యాష్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ 5 వికెట్స్ పడగొట్టడంతో పాటు పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Ravichandran Ashwin: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తన స్పిన్ మాయాజాలం చూపిస్తూ.. విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్, ఓపెనర్ త్యాగ్ నారాయణ్ చందర్‌పాల్, అరంగేట్రం ఆటగాడు అలిక్ అథానాజ్, పేసర్ అల్జారీ జోసెఫ్, బౌలర్ జోమెల్ వారికన్ వికెట్లను యాష్ ఖాతాలో వేసుకున్నాడు.
అశ్విన్ 5 వికెట్స్ పడగొట్టడంతో పాటు పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా అత్యధిక బౌల్డ్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్ 95 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 88 సార్లు, పేసర్ మహ్మద్ షమీ 66 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా ఆర్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే 953 వికెట్లు, హర్భజన్ సింగ్ 707 వికెట్లతో ఉన్నారు. అల్జారి జోసెఫ్‌ను ఔట్ చేసి ఈ ఘనతను అశ్విన్ అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో తండ్రీ, కొడును ఔట్ చేసిన అయిదో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను బౌల్డ్ చేయడంతో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.
2011లో ఢిల్లీలో అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ మ్యాచ్‌లో త్యాగ్‌నారాయణ్ తండ్రి శివ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను ఔట్ చేశాడు. తండ్రీ, కొడును ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా యాష్ నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో ఆర్ అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు, షేన్ వార్న్ 37సార్లు, రిచర్డ్ హాడ్లీ 36సార్లు, అనిల్ కుంబ్లే 35సార్లు, రంగనా హెరాత్ 34 సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను సాధించారు.