Ravindhra Jadeja: ప్రతీ మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది.. ఆడవారి విజయం వెనుక ఒక మగాడుంటాడు
రవీంద్ర జడేజా.. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్.. ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ పునరాగమనంలో అదరగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆస్ట్రేలియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
ఇక ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలోనూ జడేజా కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చి.. సొంతగడ్డపై సత్తా చాటాడు. కాగా ఈ గెలుపుతో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవగా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా జడ్డూను ధోని పైకెత్తి సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత జడ్డూ భార్య రివాబా భర్త కాళ్లకు నమస్కరించి అతడిని ఆత్మీయంగా హత్తుకోవడం హైలైట్‌గా నిలిచాయి. సంప్రదాయ చీరకట్టుతో.. చిరునవ్వు నిండిన మోముతో నిండైన రూపంతో కనిపించిన రివాబా భర్త ఆశీర్వాదం తీసుకోవడం అభిమానులకు కన్నులపండుగ చేసింది.
ఇంతకీ జడ్డూ భార్య రివాబా గురించి మీకు తెలుసా? రివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది. ఆమె తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి వ్యాపారవేత్త. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లోని ఆత్మీయ యూనివర్సిటీలో రివాబా మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జడేజా సోదరి నైనాబాకు రివాబా స్నేహితురాలు. ఓ పార్టీలో నైనా.. రివాబాను జడేజాకు పరిచయం చేసింది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ జడ్డూ- రివాబాల నిశ్చితార్థం 2016 ఫిబ్రవరి 5న జరిగింది. జడేజాకు చెందిన రెస్టారెంట్‌లో బంధువుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్ 17న వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరికి 2017లో కూతురు జన్మించింది. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరింది. భర్త ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు.
ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జామ్‌నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడపడుచు నైనాబా, మామ అనిరుద్ సింగ్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వారిని పన్నెత్తి మాట కూడా అనలేదు. భర్త జడేజా అండగా నిలవడంతో ఇంటి పోరును జయించి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ నివేదిక ప్రకారం.. రివాబా సోలంకి జడేజా ఆస్తి విలువ 64.3 కోట్ల రూపాయలు అని సమాచారం. సొంతంగా ఆమె 57.60 లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉంది. ఇక గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్‌లో ఉన్న జడ్డూకు ఈ ఏడాది ప్రమోషన్ లభించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. కాగా జడేజాకు గుజరాత్‌లో పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా ఉన్న జడ్డూ ఏటా 16 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నికర ఆస్తి రూ. 120 కోట్లుగా పలు నివేదికలు అంచనా వేశాయి. జడేజా- రివాబా దంపతులకు రాజ్‌కోట్, అహ్మాదాబాద్, జామ్‌నగర్‌లో కలిపి ఆరు ఇండ్లు ఉన్నాయి. ఇక వీరి గ్యారేజ్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ, ఫోర్డ్ ఎండీవర్, ఆడి క్యూ 7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.