సెంచరీ కోసం చూసే బ్యాటర్ కాదు, శ్రేయాస్ పై రాయుడు ప్రశంసలు
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. హైస్కోరింగ్ ఎన్ కౌంటర్ లో పరుగుల వరద పారింది.

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. హైస్కోరింగ్ ఎన్ కౌంటర్ లో పరుగుల వరద పారింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మెరుపు బ్యాటింగ్ తో దుమ్మురేపేశాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 రన్స్ చేసి విధంసకర కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మూడో స్థానంలో దిగి మెరుపులు మెరిపించిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు.వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచులో శతకాన్ని బాదుతాడని క్రికెట్ అభిమానులంతా ఆశించారు. కానీ అతడు మాత్రం తన తొలి ఐపీఎల్ సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. అందుకు కారణం.. ఆఖరి ఓవర్ మొత్తం శశాంక్ ఆడటమే. శశాంక్ ఎక్కువగా స్ట్రైకింగ్ బాధ్యత తీసుకుని భారీ షాట్లు ఆడడంతో ఆఖరి ఓవర్లో శ్రేయస్‌కు ఒక్క బంతీ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో శ్రేయస్.. సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
అయితే మ్యాచ్ అనంతరం.. శ్రేయస్ సెంచరీని ఎందుకు వదిలేశాడో శశాంక్ వివరించాడు. స్టైక్ ఆడతావా అని నేను వెళ్లి శ్రేయస్ అయ్యర్ ను అడగబోయాననీ, కానీ ముందే అతడు వచ్చి తన సెంచరీ గురించి ఆలోచించొద్దు… ప్రతీ బంతిని బాదేయమనీ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. కానీ శ్రేయాస్ చాలా నిస్వార్థంగా జట్టు కోసమే ఆలోచించాడని శశాంక్ సింగ్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే పలువురు మాజీ క్రికెటర్లు కూడా శ్రేయాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాదు జట్టు కోసం ఆడేవాడే అసలైన నాయకుడని శ్రేయస్ నిరూపించాడని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కితాబిచ్చాడు.ఇదే సమయంలో శ్రేయస్ తో పోలుస్తూ ముంబయికు చెందిన దిగ్గజ క్రికెటర్లపై సెటైర్లు వేశాడు.
ముంబయి క్రికెటర్లు సాధారణంగా వ్యక్తిగత రికార్డు కోసం చూస్తారనీ, కానీ అయ్యర్ మాత్రం అలా చేయలేదన్నాడు . శ్రేయస్.. జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వడమనేది ఓ కొత్త మార్పుగా చెప్పుకొచ్చాడు. ముంబయి క్రికెటర్స్ లో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న ప్లేయర్ ను చూడటం ఇదే తొలిసారని రాయుడు వ్యాఖ్యానించాడు. ముంబయి క్రికెటర్లు సాధారణంగా భారీ స్కోర్లు, సెంచరీలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని రాయుడు చెప్పాడు. కానీ అయ్యర్ వ్యక్తిగత రికార్డు కోసం కాకుండా జట్టు కోసం నిజాయతీగా ఆడడం అద్భుతమన్నాడు. ఎందుకంటే శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడని, అలాంటి బ్యాటర్ ను సింగిల్ తీసి కోరుకోవడం జట్టు స్కోరుపై ప్రభావం పడుతుందన్నాడు. సాధారణంగా సహచర ప్లేయర్ సెంచరీ ముంగిట ఎవరైనా స్ట్రైక్ రొటేట్ చేస్తారనీ, అయితే
కెప్టెనే స్వయంగా సెంచరీకి దగ్గరగా వచ్చాక కూడా దాని గురించి ఆలోచించొద్దని అనడం, గొప్ప విషయంగా అభివర్ణించాడు. పంజాబ్ జట్టుకు ఇలాంటి నిస్వార్థ నాయకుడు ఉండటం చాలా అదృష్టమని రాయుడు ప్రశంసించాడు.