అయ్యర్ కు గుర్తింపు రావట్లే అంబటి రాయుడి ఆవేదన
వన్డే ఫార్మాట్ లో భాగస్వామ్యాలే కీలకం... ఆరంభంలో వికెట్లు పడిపోతే నిలకడగా ఆడుతూ మంచిస్కోరు సాధించేందుకు ఎవరో ఒక బ్యాటర్ జట్టులో ఉండాల్సిందే.. ప్రస్తుతం ఈ రోల్ ను కరెక్ట్ గా పోషిస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్...

వన్డే ఫార్మాట్ లో భాగస్వామ్యాలే కీలకం… ఆరంభంలో వికెట్లు పడిపోతే నిలకడగా ఆడుతూ మంచిస్కోరు సాధించేందుకు ఎవరో ఒక బ్యాటర్ జట్టులో ఉండాల్సిందే.. ప్రస్తుతం ఈ రోల్ ను కరెక్ట్ గా పోషిస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్… గత ఏడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్ తర్వాత దేశవాళీ క్రికెట్ లో రాణించి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక బ్యాటర్ గా అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తర్వాత ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటూ ఉన్నాడు. కివీస్ తో మ్యాచ్ లో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టు అక్షర్ పటేల్‌తో కలిసి అయ్యర్ ఆదుకున్నాడు. దాంతో టీమిండియా పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. వారి వల్లే ఈ మ్యాచ్‌లో విజయం సాధించామని చెప్పాడు.
అయితే శ్రేయాస్ అయ్యర్ కు అనుకున్న గుర్తింపు రావడం లేదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.అసాధారణ ప్రదర్శనతో అయ్యర్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. టాపార్డర్ విఫలమైనప్పుడు శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు కఠినంగా మారిన వికెట్‌పై అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు. వన్డేల్లో నాలుగో, ఐదో స్థానంలో ఆడే బ్యాటర్లు చాలా కీలకమన్నాడు. ప్రస్తుతం ఫోర్త్ ప్లేస్ లో ఆడుతున్న అయ్యర్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదన్నాడు.
రాయుడి వ్యాఖ్యలతో ఏకీ భవించిన ఊతప్ప.. అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన తీరు అమోఘమన్నాడు. ప్రస్తుతం అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చిన విధానం అద్భుతమని మరో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కొనియాడాడు. ప్రతికూలతల మధ్య అతను తన ఆటపై ఫోకస్ పెట్టి మళ్లీ భారత్ రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా నిలకడగా రాణిస్తున్నాడని చెప్పాడు. అటు అభిమానుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గిల్, కోహ్లీ లాంటి ప్లేయర్స్ సెంచరీ కొడితే వచ్చే గుర్తింపులో సగం కూడా అయ్యర్ కు రావడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.