కొత్త కెప్టెన్ వచ్చాడు టైటిల్ కల నెరవేరేనా ?
ఏ సాలా కప్ నమదే... ప్రతీ ఐపీఎల్ సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం ఇది... కానీ ఒక్కసారి కూడా టైటిల్ కల మాత్రం నెరవేరలేదు..

ఏ సాలా కప్ నమదే… ప్రతీ ఐపీఎల్ సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం ఇది… కానీ ఒక్కసారి కూడా టైటిల్ కల మాత్రం నెరవేరలేదు.. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నా ఛాంపియన్ కాలేకపోయింది.. ప్రతీ సీజన్ లో ఏదో ఒక విభాగంలో ఫెయిలవుతుండడంతో టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు 18వ సీజన్ కు ఆర్సీబీ సన్నాహాలు మొదలుపెట్టింది. మెగావేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకున్న బెంగళూరు కొత్త కెప్టెన్ ను కూడా ప్రకటించింది. ఊహించని విధంగా సీనియర్ ప్లేయర్స్ ను పక్కన పెట్టి యువ ఆటగాడు రజత్ పాటిదార్ కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ 2021లో అనూహ్యంగా ఆర్‌సీబీలోకి వచ్చిన రజత్ పాటిదార్ ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌గా మారాడు. ఆర్‌సీబీ తరఫున అద్భుత ప్రదర్శనతో గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు మూడు టెస్ట్‌లు, ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అతనికి అవకాశం దక్కలేదు. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన 8వ ప్లేయర్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. 8 మంది కెప్లెన్లు మారినా ఆర్‌సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. 2009, 2016 సీజన్లలో ఫైనల్ చేరిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. అతను ఐపీఎల్ 2024 సీజన్ వరకు జట్టులో కొనసాగాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ అతన్ని వేలంలోకి వదిలేసింది. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి ఏర్పడింది.టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడుతాడని భావించినా.. అతను నిరాకరించడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. జట్టులో కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లున్నా.. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ రజత్ పాటిదార్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించింది.
రజత్ పటీదార్ కొన్నాళ్లుగా ఆర్సీబీ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ఇండియన్ టీమ్ కు కూడా ఎంపికయ్యాడు. ఈ మధ్యే అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు. అయితే అక్కడ ముంబై చేతుల్లో ఓడిపోయింది. మెగావేలానికి ముందు బెంగళూరు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్స్ లో రజత్ కూడా ఉన్నాడు. ఈ యువ ఆటగాడిని 11 కోట్లతో ఆర్సీబీ రిటైన్ చేసుకుంది.
ఆర్సీబీ తరఫున తొలి సీజన్లో ఫెయిలైనా 2022లో 333 రన్స్ చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. 2023 సీజన్ గాయం కారణంగా ఆడలేదు. ఇక గతేడాది మరింత చెలరేగి 395 రన్స్ చేశాడు. అలవోకగా సిక్సర్లు కొట్టే హిట్టర్ గా ఈ యువ ఆటగాడికి పేరుంది. మొత్తం మీద ఫ్యూచర్ సీజన్లను దృష్టిలో ఉంచుకునే రజత్ కు పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. మరి కొత్త యువ కెప్టెన్ సారథ్యంలోనైనా బెంగళూరు టైటిల్ కల నెరవేరుతుందేమో చూడాలి.