Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నమోదైన రికార్డులు
దాదాపుగా నెలరోజులుగా అలరించిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిన్నటితో ముగిసింది. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను భారత్ రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో నమోదైన రికార్డులేంటి?
దాదాపుగా నెలరోజులుగా అలరించిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిన్నటితో ముగిసింది. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను భారత్ రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో నమోదైన రికార్డుల్లోకి వెళితే, ముందుగా సిరీస్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టు చూస్తే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ఏడు ఇనింగ్స్ లో 333 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ ఆరు ఇన్నింగ్స్ లో, 297 పరుగులు చేసాడు. సిరీస్ ఆధ్యంతం అలరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, ఐదు ఇన్నింగ్స్ లో 264 పరుగులు చేసాడు. ఆసీస్ ఆటగాడు మార్నస్ లాబుషెన్ ఎనిమిది ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేస్తే, రోహిత్ శర్మ 6 ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేసాడు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే, రవి చంద్రన్ అశ్విన్ నాలుగు మ్యాచుల్లో కలిపి 25 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో నాథన్ లియోన్ 4 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టాడు. మూడోస్థానంలో రవీంద్ర జడేజా 4 మ్యాచుల్లో 22 వికెట్లు నేలకూల్చగా, టాడ్ మర్ఫీ 4 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అశ్విన్, జడేజా, లియోన్ లు రెండేసి సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. నాథన్ లియోన్ ఒక్క ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టి కేవలం 64 రన్స్ ఇచ్చాడు. రవీంద్ర జడేజా 42 పరుగులకే 7 వికెట్లు తీసాడు. టాడ్ మర్ఫీ కూడా 7 వికెట్ల హౌల్ లో ఉన్నా కూడా, తాను 124 పరుగులు సమర్పించుకున్నాడు. అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఆరు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ కూడా ఒకసారి ఐదు వికెట్ల మార్క్ అందుకున్నాడు.