నయా హిస్టరీ ముంగిట ఆ ఇద్దరు శ్రేయాస్,హార్థిక్ లను ఊరిస్తున్న రికార్డులు

ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటేనే కొత్త రికార్డులు రాబోతున్నాయని అర్థం... పరుగులు, వికెట్లు , సిక్సర్లు... ఇలా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు నయా రికార్డులు నమోదవుతానే ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 03:20 PMLast Updated on: Mar 20, 2025 | 3:20 PM

Records That Are Making History For Those Two Shreyas And Hardik

ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటేనే కొత్త రికార్డులు రాబోతున్నాయని అర్థం… పరుగులు, వికెట్లు , సిక్సర్లు… ఇలా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు నయా రికార్డులు నమోదవుతానే ఉంటాయి. ఇప్పుడు 18వ సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ సారథి హార్థిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. లీగ్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డుల ముంగిట వీరిద్దరూ నిలిచారు. కెప్టెన్లుగా ఈ ఇద్దరిలో ఎవరు టైటిల్ గెలిస్తే వారికి ఈ అరుదైన రికార్డ్‌ దక్కుతుంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లో ఎవరు టైటిల్ గెలిచినా.. ఐపీఎల్ చరిత్రలోనే రెండు ఫ్రాంచైజీల తరఫున టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలవనున్నారు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా టైటిల్ అందుకున్నాడు. అరంగేట్రం సీజన్ లోనే గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ గుజరాత్‌ను ఫైనల్ చేర్చిన హార్దిక్ పాండ్యా.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించలేక తృటిలో టైటిల్ కోల్పోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన అతను.. రోహిత్ శర్మ వారసుడిగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాడు. అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ఐపీఎల్ జర్నీ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టును ఫైనల్ చేర్చినా విజేతగా నిలబెట్టలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కేకేఆర్‌కు వెళ్లిన అతను ఆ జట్టు సారథిగా ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను అందుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలంలోకి వచ్చిన అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత 18 సీజన్లలో పంజాబ్ కింగ్స్ 17వ కెప్టెన్‌గా అయ్యర్ గుర్తింపు పొందాడు.

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది కెప్టెన్లు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడారు. ఇందులో ఆరుగురు భారత ఆటగాళ్లు ఉండగా.. మరో మరో ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నారు. కానీ ఎవరూ కూడా రెండు జట్ల తరఫున టైటిల్ గెలవలేదు. దీనిలో కేకేఆర్ మాత్రమే ఇద్దరు కెప్టెన్లతో టైటిల్ గెలిచింది. గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు టైటిల్ అందుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిస్తే ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ జాబితాలో చేరనున్నాయి. కాగా మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కత్తా, ఆర్సీబీ మ్యాచ్ తో 18వ సీజన్ మొదలుకానుంది. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించబోతున్నాయి.