మెగాటోర్నీకి రిహార్సల్స్ ఇక ఇంగ్లాండ్ తో వన్డే సమరం
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో దానికి సన్నాహకంగా ఉపయోగించుకోనుంది.
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసింది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో దానికి సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. జట్టు కూర్పు, బౌలింగ్ కాంబినేషన్ ను సెట్ చేసుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ఆడబోయే దుబాయ్ పిచ్ ఇంచుమించు స్వదేశీ పిచ్ ల తరహాలోనే ఉంటాయి. అందుకే తుది జట్టు కూర్పు విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు ఈ సిరీస్ ను ఉరయోగించుకోనుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, పంత్ వంటి వాళ్ళు ఇప్పటికే జట్టుతో చేరారు. గత ఏడాది కాలంగా వీరి ఫామ్ పేలవంగా ఉంది. అందుకే మెగాటోర్నీకి ముందు ఫామ్ అందుకోవాలని రోహిత్, కోహ్లీ భావిస్తున్నారు.
బీసీసీఐ సూచన మేరకు దేశవాళీ క్రికెట్ ఆడినా ఫామ్ అందుకోలేకపోయారు. ముఖ్యంగా కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అటు రోహిత్ శర్మది సైతం ఇదే పరిస్థితి. రిటైర్మెంట్ కు టైమ్ వచ్చిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ వీరికి అగ్నిపరీక్షగానే చెప్పాలి. పైగా మెగాటోర్నీకి ముందు కీలక బ్యాటర్లు టచ్ లోకి రావడం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ వన్డే సిరీస్ లో రోహిత్ , కోహ్లీ, రాహుల్, పంత్ పైనే అందరి దృష్టి ఉంది. బౌలింగ్ లో షమీ, అర్షదీప్ ఎలా రాణిస్తారనేది చూడాలి. టీ ట్వంటీ సిరీస్ లో షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. అతని ఫిట్ నెస్ పై ఇంకా కాస్త డౌట్స్ ఉన్న నేపథ్యంలో షమీ తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అటు స్పిన్నర్లు ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ లో సత్తా చాటగా… సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్ ఆడి ఫామ్ అందుకున్నాడు.
కాగా మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా గురువారం జరగబోతోంది. రెండో వన్డే ఆదివారం కటక్ లోనూ, చివరి వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లోనూ జరగబోతోంది. ఈ సిరీస్ ముగిసిన రెండురోజుల్లోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ బయలుదేరుతుంది. అటు ఇంగ్లాండ్ కు సైతం ఈ వన్డే సిరీస్ కీలకంగా చెప్పొచ్చు. టీ ట్వంటీల్లో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిన ఇంగ్లాండ్ మెగాటోర్నీకి ముందు సిరీస్ విజయంతో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. కానీ భారత స్పిన్ ఎటాక్ ను ఎదుర్కొని ఇంగ్లీష్ బ్యాటర్లు క్రీజులో ఏమేరకు నిలుస్తారనేది చూడాలి.