India, Pakistan : రిటైరయినా తగ్గేదే లే.. హాట్ కేకుల్లా భారత్,పాక్ లెజెండ్స్ మ్యాచ్ టికెట్లు
వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ ఎప్పుడు, ఎక్కడ తలపడినా ఆ క్రేజే వేరు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడతున్నాయి.
వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ ఎప్పుడు, ఎక్కడ తలపడినా ఆ క్రేజే వేరు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడతున్నాయి. ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ దాయాదుల సమరం అందరికీ అలరించింది. అయితే రిటైరయిన క్రికెటర్లతో నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లోనూ భారత్ , పాక్ మ్యాచ్ కు ఇదే స్థాయి క్రేజ్ కనిపిస్తోంది. ఈ మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడమే దీనికి ఉదాహారణ. మొత్తం 23 వేల టిక్కెట్లు గంటలోనే అమ్ముడైనట్టు నిర్వాహకులు వెల్లడించారు. మిగిలిన మ్యాచ్ లకు స్టేడియాలు సగమే నిండుతున్నా… భారత్ , పాక్ మ్యాచ్ కావడంతో టిక్కెట్లన్నీ వెంటనే అమ్ముడైపోయాయని తెలిపారు.
ఈ లీగ్ లో భారత్ లెజెండ్స్ జట్టుకు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. రాబిన్ ఊతప్ప, పఠాన్ బ్రదర్స్ , అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఆర్పీ సింగ్ , వినయ్ కుమార్ వంటి ప్లేయర్స్ భారత జట్టులో ఆడుతున్నారు. అటు పాక్ జట్టులో యూనిస్ ఖాన్, మిస్బాబుల్ హక్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడిన భారత్ లెజెండ్స్ విండీస్ , ఇంగ్లాండ్ జట్లపై గెలిచింది. అటు పాక్ జట్టు కూడా ఆడిన రెండు మ్యాచ్ లూ గెలవడంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.