Rinku Singh: సూపర్ ఓవర్లో మూడు సిక్సులు.. జూనియర్ క్రిస్ గేల్ విధ్వంసం..

17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్.. రింకూను బ్యాటింగ్‌కు పంపింది. కాశీ స్పిన్నర్ శివ సింగ్ బౌలర్. తొలి బంతి డాట్. కానీ తర్వాత మూడు బంతులు గాల్లోకి లేచాయి. రెండో బంతిని భారీ సిక్సర్ బాదిన రింకూ.. మూడో బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2023 | 02:20 PMLast Updated on: Sep 01, 2023 | 2:20 PM

Rinku Singh Hits Three Consecutive Sixes In Super Over Of Up T20 League

Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఉత్తరప్రదేశ్ యువ సంచలనం రింకూ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు భారీ సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు మరుపురాని విజయాన్ని అందించిన రింకూ.. తాజాగా మరోసారి అలాంటి ప్రదర్శనే చేశాడు. ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో భాగంగా రింకూ ఈ మెరుపు ప్రదర్శనతో మెరిశాడు.

యూపీ టీ20లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం.. మీరట్ మావెరిక్స్-కాశీ రుద్రాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు రింకూ.. 22 బంతులాడి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఛేదనలో కాశీ రుద్రాస్ కూడా ఏం తక్కువ తిన్లేదు. 20 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయినా 181 పరుగులు సాధించింది. ఇరు జట్ల స్కోర్లు టై కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన కాశీ.. ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఆరు బంతుల్లో 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్.. రింకూను బ్యాటింగ్‌కు పంపింది. కాశీ స్పిన్నర్ శివ సింగ్ బౌలర్. తొలి బంతి డాట్. కానీ తర్వాత మూడు బంతులు గాల్లోకి లేచాయి.

రెండో బంతిని భారీ సిక్సర్ బాదిన రింకూ.. మూడో బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు.ఇక నాలుగో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టి మీరట్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. రింకూ బాదుడు చూస్తే టీ 20 అభిమానులకు, అహ్మదాబాద్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌ను చితకబాదిన సీనే గుర్తుకు వచ్చింది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా నిలకడగా రాణిస్తున్న రింకూ ఇటీవలే భారత జట్టులోకి వచ్చాడు. కొద్దిరోజుల క్రితమే భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించగా ఆ సిరీస్‌లో రింకూకు చోటు దక్కింది. ఇక సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా క్రీడలలో ఆడబోయే భారత జట్టులో కూడా రింకూ చోటు దక్కించుకున్నాడు.