కీపింగ్..బ్యాటింగ్.. కెప్టెన్సీలోనూ తుస్, తొలి మ్యాచ్ లో పంత్ ఫ్లాప్ షో

ఐపీఎల్ లో రికార్డు ధరకు అమ్ముడై చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ తొలి మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కెప్టెన్ గా , వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇలా అన్నింటిలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 01:00 PMLast Updated on: Mar 25, 2025 | 8:45 PM

Rishab Pant Flopped In The First Match

ఐపీఎల్ లో రికార్డు ధరకు అమ్ముడై చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ తొలి మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కెప్టెన్ గా , వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇలా అన్నింటిలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. మెగావేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఢిల్లీ యాజమాన్యం అతన్ని వదిలేయడంతో ఏదో ఒక ఫ్రాంచైజీ సారథిగా అతన్ని తీసుకుంటుందన్న అంచనాలున్నాయి. ఆర్టీఎం ద్వారా చివర్లో ఢిల్లీ రేటు పెంచేయడంతో లక్నో 27 కోట్లు పెట్టక తప్పలేదు. అనుకున్నట్టుగానే లక్నో తమ జట్టు పగ్గాలను పంత్ కే అప్పగించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్ తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై చేతులెత్తేశాడు. 18వ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు అతని కెప్టెన్సీ, బ్యాటింగ్ గురించి మీడియాలో తెగ చర్చలు జరిగాయి. కానీ, కుల్దీప్ బంతికి గోల్డెన్ డక్ అవ్వడంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

పూరన్ , మార్ష్ చెలరేగిపోయిన పిచ్ పై పంత్ డకౌట్ అవ్వడం అభిమానులను తీవ్రంగానే హర్ట్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడిన ఏ మ్యాచ్ లోనూ ప్లేయింగ్ 11లో అవకాశం దక్కని రిషబ్ పంత్‌ ఐపీఎల్‌లో నిరూపించుకోవాలనుకున్నాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే కనీసం బంతిని సరిగ్గా టచ్ కూడా చేయలేకపోయాడు. ఒకవైపు పూరాన్ వరుస సిక్సర్లు బాదుతుంటే పంత్ ఫీల్డర్లను దాటి బంతిని కొట్టలేకపోయాడు. ఆరు బంతులు ఆడిన రిషబ్ పంత్ స్ట్రయిట్ క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోతే.. ఆ మిగతా ఐదు వికెట్లను పడగొట్టడంలో కెప్టెన్‌గా విఫలమయ్యాడు. 19వ ఓవర్‌లో అశుతోష్‌ని రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయిన పంత్.. ఆఖరి ఓవర్‌లో ఈజీ స్టంప్ అవుట్‌ని మిస్ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 22 పరుగులు కావాల్సి ఉండగా…. లక్నోకి రెండు వికెట్లు కావాలి. ఆ సమయంలో సీనియర్ అయిన శార్థూల్‌ని పక్కనబెట్టి మరీ ప్రిన్స్ యాదవ్ చేతికి పంత్ బంతిని ఇచ్చాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ప్రిన్ యాదవ్ 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్ షాబాజ్‌కి ఇచ్చినప్పటికీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. పంత్ శార్థూల్‌కి బంతిని ఇచ్చుండాల్సింది అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎటు చూసినా ఈ మ్యాచ్ ఓటమికి రిషబ్ పంత్ నే కారణంగా చెబుతున్నారు.

మార్ష్ , పూరన్ భారీస్కోరుకు పునాది వేస్తే మిగిలిన బ్యాటర్లు ఫెయిలయ్యారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు లక్నో 250 పైచిలుకు పరుగులు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మార్ష్‌, పూరన్‌ ఔటయ్యాక ఆ జట్టు​ మిడిలార్డర్‌ అనూహ్యంగా కుప్పకూలింది. రిషబ్‌ పంత్‌ 6 బంతుల్లో​ డకౌట్‌ కాగా.. ఆయుశ్‌ బదోని , శార్దూల్‌ ఠాకూర్‌ , షాబాజ్‌ అహ్మద్‌ అంచనాలను అందుకోలేదు. చివరి ఓవర్‌లో డేవిడ్‌ మిల్లర్‌ రెండు సిక్సర్లు బాదడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది. తర్వాత 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో అశుతోష్‌ అద్భుతం చేశాడు. విప్రాజ్‌ నిగమ్‌ సాయంతో ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. ఓవరాల్ గా పేలక కెప్టెన్సీ, వికెట్ల వెనుక తప్పిదాలతో లక్నో ఓటమికి పంత్ కారణమయ్యాడు.